బీ అలర్ట్..! | Sakshi
Sakshi News home page

బీ అలర్ట్..!

Published Mon, Feb 10 2014 1:59 AM

Bee Alert

 సాక్షి, ఏలూరు:సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. ఎన్నికలయ్యేంత వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావు తొలిసారిగా ఆదివారం జిల్లాకు వచ్చారు. శాంతిభద్రతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, రానున్న ఎన్నికలపై కోస్తా రీజియన్ ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవహరించాల్సిన తీరు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బైండోవర్లపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరంవిలేకరులతో మాట్లాడారు.
 
 ఎన్నికలకు అదనపు బలగాలు 
 రానున్న ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. 2009 ఎన్నికల నిర్వహణలో అమలు చేసిన విధానాలను దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అదనపు బలగాల విషయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని డీజీపీ తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పోలీస్ సిబ్బంది బదిలీలు జరిగాయన్నారు. సైబర్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత సిబ్బందికి వివిధ మాడ్యూల్స్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తున్నామన్నారు. బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి రాష్ర్ట్రంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నకిలీ కరెన్సీని పూర్తిగా నిరోధించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
 పోలీసు శాఖలో వివిధ హోదాలకు సంబంధించి పదోన్నతుల విషయంలో కొందరు ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించడం వల్ల జాప్యం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, నూతన భవనాల నిర్మాణం కోసం ఇక నుంచి రాష్ట్ర పోలీస్ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరతామన్నారు. ఈ సమీక్షలో కోస్తా రీజియన్ (విశాఖపట్నం) ఐజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్, ఎస్పీ ఎస్.హరికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎన్.శివశంకరరెడ్డి, రాజమండ్రి అర్భన్ పోలీస్ జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి, మూడు జిల్లాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. 
 
 డీజీపీకి ఘన స్వాగతం
 తొలిసారిగా జిల్లాకు వచ్చిన డీజీపీ ప్రసాదరావుకు జిల్లా పోలీసులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం గన్నవరం విమాశ్రయం నుంచి ఏలూరు చేరుకుని స్థానిక పోలీస్‌గెస్ట్ హౌస్‌లో మధ్యాహ్న భోజనం పూర్తి చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పలువురు పోలీసులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 
 

Advertisement
Advertisement