మీ పొలం మా ఇష్టం | Sakshi
Sakshi News home page

మీ పొలం మా ఇష్టం

Published Tue, Aug 21 2018 12:15 PM

BTP Works Starts Without Compensation Anantapur - Sakshi

బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలోని టీడీపీ కార్యకర్త రాజన్న పొలం ఇది.     ఆ పార్టీ ముఖ్య నేతలు చెప్పడంతో కాలువ తవ్వకాలకు ఒప్పుకున్నాడు. ఇలా పార్టీ వర్గీయుల పొలాల్లోనే పనులు చేపడుతూ రైతులెవ్వరూ ఫిర్యాదు చేయడం లేదని టీడీపీ ముఖ్య నేతలు ప్రచారం చేసుకోవడం ఆత్మవంచనే.

కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: అసలే ‘ప్యాకేజీ’ల పనులు. కాంట్రాక్టు ఒకరు దక్కించుకుంటే.. పనులు చేసేది మరొకరు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే మరో ఆరేడు నెలలు. ఇంతలోపు పనులు కానిద్దాం. అయినంత వరకు బిల్లులు చేసుకుందాం. రైతుల భూములు, పరిహారం ఆ తర్వాత వారి ఖర్మకు వదిలేద్దాం. ఇదీ బీటీపీ పనుల తీరు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి టీడీపీనేతలు, కాంట్రాక్టర్లు సాగిస్తున్న ‘ధనయజ్ఞం’ ఎన్నో జీవితాల్లో చీకట్లు నింపుతోంది. భైరవానితిప్ప ప్రాజెక్ట్‌కు కృష్ణాజలాల తరలింపులో భాగంగా చేపడుతున్న కాలువ పనుల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భూ సేకరణ చేయకుండా.. నష్టపరిహారం చెల్లించకుండా.. జిల్లా అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే కాలువలు తవ్వేందుకు సిద్ధపడటంతో రైతులు కన్నెర్ర చేస్తున్నారు.

ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ గత శనివారం నుంచి కాలువ పనులకు సిద్ధపడింది. సర్వే నంబర్‌ 248లోని 5 ఎకరాల్లో పనులు ప్రారంభించగా.. సర్వే నెంబర్‌ 263–1,2లోని 4.36 ఎకరాలలో నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు చేయనిచ్చేది లేదని బాధిత రైతు పాతన్నతో పాటు ఎంపీటీసీ మాజీ సభ్యుడు లోకేష్‌ అడ్డు చెప్పారు. దీంతో కాంట్రాక్టర్‌ పక్కనే ఉన్న టీడీపీ కార్యకర్త రాజన్న పొలంలో పనులు చేపట్టారు. టీడీపీ వర్గీయుల పొలాల్లో పనులు చేపడుతూ రైతులు ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదంటూ మిగిలిన రైతులను బెదిరిస్తుండటం గందరగోళానికి తావిస్తోంది. కాలువ తవ్వకానికి సర్వేలు పూర్తి కాలేదు.. పరిహారం ఏ మేరకు ఇస్తారో తెలియదు.. ఏ రైతు పొలంలో ఎంత మేరకు భూమి కాలువకు పోతుందో అర్థం కావట్లేదు.. అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.

బీటీపీ బ్రాంచ్‌ కెనాల్‌ డీపీఆర్‌..
జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా నీటిని బీటీపీ బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా భైరవానితిప్ప ప్రాజెక్టుకు, కళ్యాణదుర్గం నియోజకవర్గం చెరువులకు నీరు నింపాలనేది లక్ష్యం. ఇందు కోసం కుందుర్పి కెనాల్‌ 62 కిలోమీటర్లు, మార్గమధ్యంలోని గరుడాపురం నుంచి 31 కిలోమీటర్లు మొత్తం 93 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వాల్సి ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు.. వీటి పరిధిలోని 15,300 ఎకరాల ఆయకట్టుకు నీరు, బీటీపీలోకి నీరు తీసుకెళ్లి 12వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేది నిర్దేశం. రూ.968 కోట్లు కేటాయించగా.. అనంతపురానికి చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ టెండర్‌ను దక్కించుకుంది.

వీళ్లంతా రైతులే...
నా పేరు యల్లమరాజు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామం. సర్వే నం.552లో 8.50 ఎకరాల పొలం ఉంది. కాలువ తవ్వకానికి 6 ఎకరాల్లో గుర్తులు వేశారు. పరిహారం ఎంతిస్తారో తెలియదు. ఎప్పుడిస్తారో చెప్పలేదు.
నా పేరు మల్లికార్జున. ఎస్‌.కోనాపురం గ్రామం. సంతేకొండాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.561లో 2.14 ఎకరాల పొలం ఉంది. ఎకరా పొలంలో కాలువ తవ్వేందుకు గుర్తులు వేశారు. పరిహారం ఇవ్వకుండా పనులంటే ఒప్పుకోను.
నా పేరు కరేగౌడ్‌. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి. భైరవానితిప్ప రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 142–5, 139–2లలో 4 ఎకరాల పొలం ఉంది. మూడు ఎకరాల్లో కాలువ తవ్వేందుకు కాంట్రాక్టర్‌ ప్రయత్నించగా అడ్డుకున్నాం.

పనులకు సంబంధించి సమాచారం లేదు
కాలువ పనులకు సుమారు 385 ఎకరాల భూమి అవసరమని గతంలో గుర్తించారు. నేను ఇటీవలనే భాధ్యతలు చేపట్టాను. భూసేకరణ, నష్టపరిహారం తదితర వివరాలన్నీ భూసేకరణ విభాగం ఆధ్వర్యంలో చేపడతారు. మేము కేవలం అధికారులు అడిగిన రికార్డులు మాత్రమే అందజేస్తాం. నష్టపరిహారం కానీ, సేకరణ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
– నరసింహారావు, తహసీల్దార్, బ్రహ్మసముద్రం 

Advertisement
Advertisement