‘సర్వేలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’ | Sakshi
Sakshi News home page

‘ఆ హక్కు చంద్రబాబు నాయుడుకు లేదు’

Published Tue, Jul 18 2017 6:40 PM

‘సర్వేలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’ - Sakshi

మాచర్ల: ‘రాష్ట్రంలో ఏం జరిగినా మాకు తెలుస్తాయి. అందరి జాతకాలు మా చేతిలో ఉన్నాయి. మీ గురించి సర్వే చేయించాను. అందరి గురించి నాకు తెలుసు..’ అని సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా బెదిరిస్తూ బతికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేలపై అనుచితంగా మాట్లాడటం సరికాదని వైఎస్‌ఆర్‌ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి ఇదిగో మీ జాతకాలు అంటూ, సీల్డు కవర్లు అందించి సర్వేలో వచ్చిన ఫలితాలు బట్టి మాట్లాడే సీఎంకు వైఎస్సార్‌ సీపీని విమర్శించే హక్కు లేదన్నారు.

తాను అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశానని, తనకు వ్యూహకర్తలు, నాయకులతో పనిలేదని చెప్పుకునే సీఎం ప్రతిపక్షం తరఫున ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కొంతమందిని వ్యూహకర్తలుగా నియమిస్తే వారిని విమర్శించడం తగదన్నారు. నవరత్నాల పేరుతో వైఎస్సార్‌ సీపీ అధినేత  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రకు వెళతానంటే తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో సీఎం వణుకుతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ను విమర్శించి అధికార పార్టీ నాయకులు బతుకుతున్నారన్నారు.

ఇప్పటికైనా మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకులపై ఉందన్నారు. సీఎంకు అంత వ్యూహకర్త అయితే వచ్చే ఎన్నికల్లో సీఎం ఎలాంటి సర్వే చేయించకుండా టీడీపీని గెలిపించుకోవాలని సవాల్‌ విసిరారు. పోలీసులు, ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర సర్వేలు చేయించుకునే సీఎంకు వైఎస్‌.జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.

Advertisement
Advertisement