‘పెథాయ్‌’ పేరిట హంగామా | Sakshi
Sakshi News home page

‘పెథాయ్‌’ పేరిట హంగామా

Published Wed, Dec 19 2018 12:34 PM

Chandrababu naidu Visit East Godavari - Sakshi

కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పెథాయ్‌.. దాదాపు వారం రోజుల పాటు జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుపాను. గంటకోవైపు తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన ఈ తుపాను సోమవారం జిల్లా తీరాన్ని తాకింది. ఊహించినంత స్థాయిలో నష్టం లేకుండానే గండం గట్టెక్కడంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను విరుచుకుపడినవేళ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల సంబరాల్లో మునిగితేలేందుకు సీఎం చంద్రబాబు వెళ్లిపోవడంపై ఊరూవాడా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా రాజకీయాల కోసం రాష్ట్రాలు పట్టి తిరగడమేమిటంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో సీఎం మంగళవారం హఠాత్తుగా జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ తుపాను వల్ల భారీ స్థాయిలో నష్టం లేకున్నా హడావుడి పర్యటనతో హంగామా చేశారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ చేసుకుంటూ ఉదయం 12 గంటలకు గాడిమొగ చేరుకున్న ఆయన నేరుగా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రంలో బాధితులతో ముచ్చటించారు. రెండు రోజులుగా ఇక్కడ పెద్దగా ఆశ్రయం పొందని తుపాను బాధితులందరినీ సీఎం వస్తున్నారంటూ బలవంతంగా రప్పించారు. అక్కడ సీఎం వారి సమస్యలు వినకుండా తన ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడంతో సరిపెట్టారు.

‘మీరొచ్చాక కరెంట్‌ బిల్లు రూ.500 వస్తోంది’ భైరవపాలెం వాసుల ఆవేదన
ముఖ్యమంత్రి వచ్చారు కదా! తమ సమస్యలు చెప్పుకుందామని భైరవపాలెం గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే, తాను చెప్పదలచుకున్నదే తప్ప బాధితుల గోడు వినేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎన్ని రోజులుగా ఉన్నారు? భోజనాలు పెట్టారా? అని ఆరా తీశారే తప్ప వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. తామంతా పొట్టకూటి కోసం ఇంటిల్లిపాదీ వేటకు వెళ్లిపోతామని, కానీ ఇంటి కరెంట్‌ బిల్లు ఏకంగా నెలకు రూ.500 వస్తోందని, గతంలో రూ.150 నుంచి రూ.200 వచ్చేదని గ్రామానికి చెందిన భూలక్ష్మి, వీరవేణి అనే మహిళలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరెంట్‌ బిల్లులు కట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా ఇళ్లు లేకపోవడం వల్లనే తుపాను సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఇళ్లు మంజూరు చేయాలని తాతారావు తదితరులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు తమ సమస్యలు చెబుతుంటే పట్టించుకోకుండా బయటకొచ్చిన ముఖ్యమంత్రి తనదైన శైలిలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఏకరవు పెట్టారు. మొన్న హుద్‌హుద్, నిన్న తిత్లీ, నేడు పెథాయ్‌ తుపాన్లను తానే ఎదుర్కొన్నానని చెప్పారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. ఆ వెంటనే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం వెనుక తాను ఉన్నానని చెప్పారు.

అనంతరం అక్కడినుంచి హెలికాప్టర్‌లో కాకినాడ చేరుకున్న చంద్రబాబు తుపాను నష్టం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని మీడియా సమావేశంలో వివరిస్తూ, హుద్‌హుద్, తిత్లీ మాదిరిగానే పెథాయ్‌ను జయించామని చెప్పారు. ఇదంతా తన గొప్పతనమేనన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కంటే తానే గొప్పని, తాను తీసుకొచ్చిన అవేర్‌ సిస్టమ్‌ ద్వారానే తుపాను ఎక్కడ, ఎప్పుడు తీరం దాటబోతుందో పసిగట్టగలిగామని అన్నారు. తుపాను వేళ ప్రమాణ స్వీకారోత్సవాలకు వెళ్లడాన్ని సమర్థిచుకుంటూ.. అలా వెళ్తే తప్పేమిటని ఎదురు ప్రశ్న వేశారు. విపక్షాలు కావాలనే తనపై బురద జల్లుతున్నాయని అన్నారు.

Advertisement
Advertisement