15 నుంచి 20 శాతం మిగులు | Sakshi
Sakshi News home page

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో 15 నుంచి 20 శాతం మిగులు

Published Sat, Jul 20 2019 4:43 AM

CM YS Jagan comments about Polavaram Reverse Tendering in Assembly - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం అవినీతి వెలుగులోకి వస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు భయపడుతున్నాడని, తనకేమీ సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరంపై టీడీపీ పక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ బదులిచ్చారు. మంత్రి సమాధానంపై సంతృప్తి లేదంటూ విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఈ దశలో సీఎం జగన్‌ దీటుగా బదులిచ్చారు. మరో 20 రోజుల్లో పోలవరంలో జరిగిన అన్ని అవకతవకలు బయటకు వస్తాయని చెప్పారు. కుంభకోణాల్లో తన ప్రమేయం లేదనిపించుకోవాలనే దుర్బుద్ధితో చంద్రబాబు సభలో అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

చంద్రబాబు వల్లే ఆగిన పోలవరం పనులు..
‘పోలవరం ప్రాజెక్టుపై మూడు రోజులుగా సభలో చర్చ జరుగుతూనే ఉంది. నీటిపారుదల శాఖ మంత్రి రోజూ సుదీర్ఘ వివరణ ఇస్తూనే ఉన్నారు. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై పరిశీలనకు నిపుణుల కమిటీని వేశాం. ఆ కమిటీ హెడ్‌వర్క్స్, పవర్‌ ప్రాజెక్టులపై ఇప్పటికే అధ్యయనం చేసింది. కుడి, ఎడమ కాల్వల మీద రెండు మూడు రోజుల్లో అధ్యయనం పూర్తవుతుంది. ఇందులో డబ్బులు ఎక్కడ ఆదా చేయాలనే దానిపై కమిటీ దృష్టి పెడుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ నవంబర్‌ ఒకటో తేదీ నుంచి పోలవరం పనులు మొదలు పెట్టాలి. చంద్రబాబు చలవ వల్లే గత నాలుగు నెలలుగా పోలవరం పనులు ఆగిపోయాయి. ఎందుకంటే జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ దాదాపు 10 లక్షల క్యూసెక్కులపైనే వరదలు వస్తాయి. కాపర్‌ డ్యామ్‌ను కడితేనే మెయిన్‌ డ్యామ్‌ కట్టొచ్చు. అయితే స్పిల్‌వే పనులు పూర్తి చేయకుండా కాపర్‌ డ్యామ్‌ మీద పనులు మొదలు పెట్టారు. 1.4 కిలోమీటర్ల మేర వెడల్పులో గోదావరి ప్రవాహం వెళ్తే వరద ప్రభావం ఇతర ప్రాంతాలపై పడదు. కాఫర్‌డ్యామ్‌ కట్టడం వల్ల గోదావరి వెడల్పు 70 శాతం తగ్గింది. 

ఈ పరిస్థితుల్లో నీళ్లు పైకి వచ్చి స్పిల్‌వే ద్వారా బయటకొస్తాయి. ఈ కారణంగా స్పిల్‌వే పనులు కూడా ఆగిపోయాయి. అందువల్ల కాపర్‌డ్యాం, మెయిన్‌ డ్యాం పనులు చేయలేని పరిస్థితి. ఇటీవల ఆ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత నేను అధికారులు, మీడియా సమక్షంలో సమీక్ష జరిపినప్పుడు తెలిసి విషయాలివి. కాబట్టి నవంబర్‌ కల్లా దీన్ని మొదలు పెట్టి జూన్‌ 2021 నాటికి కచ్చితంగా నీళ్లివ్వాలని గట్టిగా ఉన్నాం. అందుకే అక్కడ పనులను, అవినీతిని లెక్కించేందుకు నిపుణుల కమిటీని పెట్టాం. ఆ కమిటీ పోలవరంలో ఏ మేరకు కుంభకోణాలు జరిగాయో నిర్ధారిస్తోంది. ఆ కమిటీ రిపోర్టుల ప్రకారం రివర్స్‌ టెండరింగ్‌ పిలుస్తాం. ఇది దేశంలోనే తొలిసారి చేసే ప్రయత్నం.

అయినవాళ్లకు అడ్డగోలుగా సబ్‌ కాంట్రాక్టులు
‘రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరం పనుల్లో మొదట వాళ్లు పిలిచిన రేటు ఎంతో కోట్‌ చేస్తాం. టెండర్‌లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సవరించి (ప్రీ క్వాలిఫికేషన్‌ రిలాక్స్‌) ఎక్కువ మంది పాల్గొనేలా చేస్తున్నాం. ఎవరైతే తక్కువకు కోట్‌ చేస్తారో వాళ్లకే పనులు ఇస్తాం. ఈ విధానం వల్ల కనీసం 15 నుంచి 20 శాతం నిధులు మిగులుతాయని అధికారుల నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికలను బట్టి అంచనా వేస్తున్నాం. అంటే రూ. 6,500 కోట్ల పనుల్లోనే దాదాపు రూ. 1,500 కోట్లు మిగులుతుంది. టీడీపీ హయాంలో తమకు నచ్చిన వాళ్లకు నామినేషన్‌ పద్దతిలో సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చారు. సాక్షాత్తు అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు కూడా అక్కడ సబ్‌ కాంట్రాక్టర్‌గా పెంచిన రేట్లతో పనిచేస్తున్నాడు. పవర్‌ ప్లాంట్‌ను జెన్‌కో ద్వారా వాళ్లకు కావాల్సిన నవయుగ కంపెనీకి ఇచ్చారు. ఇంతవరకూ కనీసం ఒక్క ఇటుక పడలేదు. రూ. 720 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద ఇచ్చారు. అవన్నీ కూడా నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆ రిపోర్టులు బయటకొస్తున్నాయి. పోలవరంలో ఏ స్థాయిలో దోచేశారో అన్న సంగతులు మరో 15–20 రోజుల్లో బయటకొస్తాయి. అక్కడ ఇంత జరిగినా ఏమీ జరగనట్టు ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు రకరకాల జిత్తులు, కుయుక్తులు పన్నుతున్నాడు. అసెంబ్లీలో నానా యాగీ చేస్తున్నారు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

Advertisement
Advertisement