సత్వరమే పరిహారం.. పునరావాసం | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిహారం.. పునరావాసం

Published Thu, Mar 19 2015 3:41 AM

Compensation, rehabilitation immediately ..

ముకరంపుర: జిల్లాలోని ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టుల భూనిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ హామీ ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని కోరారు. పరిహారం కోసం పనులను అడ్డుకునేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టుల భూనిర్వాసితులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్వాసితులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు. ఇండ్ల నష్టపరిహారం కోసం భూ సేకరణ చట్టం ప్రకారం యూభై శాతం కన్నా ఎక్కువ కట్టడాలకు చెల్లింపు జరిగితే పాత చట్టం ప్రకారమే మిగతా పరిహారం అందిస్తామన్నారు.

నోటిఫికేషన్ జారీ అరుున సమయూనికి పద్దెనిమిదేళ్లు నిండిన యువతీ యువకులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. కొత్త, పాత భూ సేకరణ చట్టంలోనూ తరుగుదలతో చెల్లింపులు చేయాలని ఉందని, దాని ప్రకారం చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. పునరావాస కాలనీల్లో కమ్యూనిటీహాల్, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సబ్ సెంటర్లు నిర్మిస్తామని, త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ముంపు గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలకు కొలతల ప్రకారం పరిహారం ఇస్తామని, తిరిగి పునరావాస కాలనీల్లో నిర్మిం చుకునే బాధ్యత ఎవరికివారే తీసుకోవాలన్నారు.

కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామా ల్లో  60ఏళ్లు దాటిన మిగిలిపోయిన మహిళలను గుర్తించేందుకు గ్రామాల వారీగా విచారణ అధికారుల బృందాలను పంపించి మిషన్ మోడ్‌లో పరిశీలన పూర్తి చేస్తామన్నారు. ఇంకా తప్పిపోయిన, మిగిలిపోయిన కుటుంబాలను విచారణ చేసి నోటిఫై చేయాలన్నారు. చదువుకున్న యువతకు న్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి అవకాశాలు, ఉపాధిహామీ పనులు కల్పిస్తామన్నారు.
 
నష్టపరిహారం తగ్గించొద్దు
 భూనిర్వాసితులు మాట్లాడుతూ.. 2015 సంవత్సరం నాటికి పద్దెమినిదేళ్లు నిండిన యువతీ యువకులకు, అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. నష్టపరిహారం చెల్లింపులో తరుగుదల లేకుండా చూడాలన్నారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించాలని, పునరావాస కాలనీల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, గృహనిర్మాణం కింద నాలుగు గదుల ఇల్లు నిర్మించాలని, కులవృత్తుల వారికి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. సమావేశంలో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు, ప్రాజెక్ట్‌ల సీఈ అనిల్‌కుమార్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
సహకరిస్తాం.. సమస్యలు పరిష్కరించండి
ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరిస్తామని.. తమ సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని జిల్లా భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌కు విన్నవించారు. మధ్యమానేరులో మునిగిపోతున్న కొదురుపాక, నీలోజిపల్లి, చీర్లవంచ, చింతల్‌ఠాణా, రుద్రవరం గ్రామాల నిర్వాసితులకు ఇండ్ల నష్టపరిహారం, పట్టా, అసైన్డ్ భూముల నష్టపరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. ఇండ్లు, ఇతర కట్టడాలకు వాడిన కలపపై తరుగుదల చేయాలని నిర్ణయించడం అశాస్త్రీయమన్నారు.

భూ సేకరణ చట్టం 2014 ప్రకారం నష్టపరిహారం, పునరావాసం, పునఃనిర్మాణం చర్యలు చేపట్టాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ముంపుకు గురికాని ప్రాంతాలకు కరెంటు సరఫరా అలాగే ఉంచాలని, అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని కోరారు. సుదీర్ఘ చర్చ అనంతరం జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొలుమాల శంకర్, ప్రధాన కార్యదర్శి రేగుల పాటి వెంకట్రావు ఉపాధ్యక్షుడు ముంజ సతీష్‌గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement