Sakshi News home page

పీఓ బదిలీకి కుట్ర!

Published Thu, Nov 28 2013 2:31 AM

Conspiracy to transfer PO

నిధులు దండుకునేందుకు పన్నాగం
 
మేడారం మహాజాతర నిధులను దండుకునేందుకు రాజకీయ శక్తులు కుట్రపన్నుతున్నాయి. ఐటీడీఏ పీఓగా ఐఏఎస్ అధికారి ఉంటే తమ ఆటలు సాగడం లేదని ఆయన బదిలీకి ప్రయత్నాలు మొదలుపెట్టారుు. రెండు మూడు రోజుల్లోనే బదిలీ ఉత్తర్వులు వెలువడేంత వేగంగా ఫైళ్లు కదులుతున్నాయి. ఇందుకు కేంద్ర నేత పావులు కదుపుతున్నట్టు తెలిసింది. గత వేసవిలో గోదావరి ఇసుక తరలిం పునకు అడ్డుపడిన ఐఏఎస్ అధికారిని సాగనంపితే.. వచ్చే వేసవిలో తమకు అడ్డు ఉండదని ఇసుక మాఫియా కూడా జతకట్టినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారినే తిరిగి రప్పించేందుకు ప్రయత్నించడం గమనార్హం.
 
ములుగు, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) లక్ష్యం నీరుగారిపోతున్న దశలో ఐఏఎస్ అధికారి సర్పరాజ్ అహ్మద్ గతేడాది ఆగస్టు 7న పీఓ(ప్రాజెక్టు అధికారి)గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సర్ఫరాజ్.. అవినీతికి అడ్డుకట్ట వేయడమే కాకుండా అధికారుల్లో సమయపాలన, క్రమశిక్షణ తీసుకువచ్చారు. ఇది మింగుడుపడని కిందిస్థాయి అధికారులు కుయుక్తులకు తె రలేపారు. కావాలని.. ఓ వర్గం గిరిజనులను ఉసిగొల్పారు. సర్ఫరాజ్ మరో వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉంటున్నాడని రెచ్చగొట్టే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇలా మొదలైన వివాదం.. సదరు వర్గానికి చెందిన ‘పెద్ద’నేత పీఓ బదిలీ కోసం పట్టుబట్టే స్థాయికి చేరింది.
 
నిధులు మింగేందుకే..

వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం మహా జాతరలో వివిధ సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో పనులు చేపట్టనుంది. జాతర పనులంటేనే బెల్లంలా భావించే నాయకులు, అధికారు లు, కాంట్రాక్టర్లకు నిక్కచ్చిగా వ్యవహరించే వారంటే గిట్టని పరిస్థితి ఉం ది. కచ్చితత్వం పాటించే అధికారులకు స్థానచలనం కలిగించి, అనుకూలంగా ఉండే వారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం కొన్ని జాతరల సందర్భంగా జరిగింది.

అయితే ఇప్పుడు ఐఏఎస్ అధికారిని కూడా బది లీ చేయించేందుకు ఎత్తుగడ వేయడం ఆందోళన కలిగిస్తోంది. జాతర పనులపై  కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలనలు చేసినా.. నిత్యం మేడారం పై నిఘా పెట్టే బాధ్యత ఐటీడీఏ పీఓపైనే ఎక్కువగా ఉంటుంది. గత వేసవిలో గోదావరి ఇసుక రీచ్‌ల అనుమతులకు సర్ఫరాజ్ అడ్డుకట్ట వేశారు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు వెరవకుండా గిరిజనులకే బాసటగా నిలిచారు. దీంతో బదిలీ కుతంత్రాలకు తెరలేపినట్లు తెలిసింది.
 
ఆయనే కావాలట!

ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడి నుంచి బదిలీపై వె ళ్లిన ఓ అధికారినే మళ్లీ ఇక్కడికి పీఓగా తీసుకురావాలని పాకులాడడం విమర్శలకు తావిస్తోంది. గత జాతరలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నాలపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత జాతరలో ఇప్పటి పీఓ సర్పరాజ్ అహ్మద్ ములుగు సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయనకు కూడా జాతరపై సంపూర్ణ అవగాహన ఉంది. అయినా... జాతర అనుభవం ప్రాతిపదికన ఐఏఎస్ అధికారి బదిలీకి యత్నాలు చేయడం తగదంటున్నారు.

పీఓగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ఆ అధికారి రాజకీయ నాయకులకుతో ముందస్తు ‘ఒప్పందం’ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి ఆరోపణలు మెండుగా ఉన్నా.. సదరు అధికారివైపే నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆ అధికారి గతంలో ఇక్కడ పనిచేసిన కాలంలో సుమారు రూ.50 కోట్లకు సంబంధించిన ఈజీఎస్ పనులను కట్టబెడతానని హామీ ఇస్తూ తన కింది స్థాయి అధికారితో కలిసి అక్రమతంతు నడిపినట్లు ఆరోపణలున్నాయి. ముందస్తుగానే కాంట్రాక్టర్‌ల వద్ద ఐదు శాతం కమీషన్ వసూలు చేసి.. తీరా పనులు అప్పగించకపోవడంతో విషయం బయటకు పొక్కినట్లు గిరిజన సంఘా లు పేర్కొంటున్నాయి.

దీనికితోడు గత జాతరలో నాసిరకం పనులకు అండగా నిలిచాడని, జాతరలోని దుకాణాల వద్ద వసూలు చేసిన సొమ్ము కు సంబంధించిన లెక్కలు ఆడిట్‌లో చూపించలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ చేశారని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. దీంతో విధులకు సెలవుపెట్టి వెళ్లిన ఆయన.. మళ్లీ రాలేదు. ప్రస్తుతం పీఓ సర్ఫరాజ్ అహ్మద్ తన వివాహ వేడుకల సందర్భంగా ఈనెల 17నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు సెలవులో ఉండగా.. అడిషనల్ జేసీ సంజీవయ్య ఇంచార్జ్ పీఓగా ఉన్నారు. కాగా, పీఓ సర్ఫరాజ్‌ను బదిలీచేస్తే ఆందోళనలు చేపడుతామని ఏజెన్సీవాసులు హెచ్చరిస్తున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement