కరోనా: కర్నూలులో 115 కేసులు | Sakshi
Sakshi News home page

హాట్‌స్పాట్లలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ 

Published Thu, Apr 16 2020 9:31 AM

Coronavirus: 115 Corona Positive Cases In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం తొమ్మిది మందికి ఈ వైరస్‌ వెలుగు చూడగా.. బుధవారం మరో 22 మందికి నిర్ధారణ అయ్యింది. వీరిలో 20 మంది కర్నూలు నగరానికి చెందిన వారే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య జిల్లాలో 115కు చేరింది. ఇందులో 50 కేసులు కర్నూలు నగరంలోనే నమోదు కావడం గమనార్హం. అలాగే నంద్యాల మున్సిపాలిటీలో 20, ఆత్మకూరు మున్సిపాలిటీలో 5, నందికొట్కూరు మున్సిపాలిటీలో 3, డోన్‌ మున్సిపాలిటీలో ఒకటి, బేతంచర్ల మున్సిపాలిటీలో ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో నంద్యాల రూరల్‌ ఏడు, పాణ్యం 7, బనగానపల్లె 5, చాగలమర్రి 3, కోడుమూరు 3, గడివేముల 2, శిరివెళ్ల 2, కర్నూలు రూరల్‌ ఒకటి, నందికొట్కూరు రూరల్‌ ఒకటి, ఓర్వకల్లు ఒకటి, అవుకు ఒకటి, రుద్రవరం ఒకటి, సంజామలలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

బుధవారం 158 శాంపిల్స్‌ రిపోర్ట్‌ రాగా.. అందులో 136 నెగిటివ్, 22 పాజిటివ్‌గా తేలాయి. ఇప్పటి వరకు  మొత్తం 2,163 శాంపిల్స్‌ తీయగా, 1,137 మంది నివేదికలు వచ్చాయి. ఇంకా 1,026 మంది నివేదికలు రావాల్సి ఉంది. ప్రస్తుతం కోవిడ్‌–19 కేర్‌ సెంటర్లలో 1,038 మంది ఉన్నారు. కర్నూలు నగరంలో కేసుల సంఖ్య 50కి చేరుకోవడంతో అధికారులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.  

హోం క్వారంటైన్‌లో వన్‌టౌన్‌ సీఐ 
కర్నూలు: కర్నూలు ఒకటో పట్టణ సీఐ దస్తగిరి బాబు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి నిరంతర విధుల్లో ఉంటున్న ఆయన బుధవారం అస్వస్తతకు గురయ్యారు. దీంతో వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆయన స్థానంలో గతంలో ఇదే స్టేషన్‌లో పనిచేసిన శ్రీరాములుకు ఇన్‌చార్జ్‌బాధ్యతలు అప్పగించారు.  

హాట్‌స్పాట్లలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ 
సాక్షి, కర్నూలు:   కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హాట్‌స్పాట్‌ ఏరియాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబ ఆదేశించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో జన సంచారం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనుమానం ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. బుధవారం ఆయన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఎంపిక చేసిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కరోనాపై సమీక్షించారు. ఎంపిక చేసిన జాబితాలో కర్నూలు ఉండడంతో స్థానిక ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు
జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఎక్కువమంది కరోనా బారినపడ్డారని తెలిపారు. పశి్చమ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి లేకపోయినా అక్కడ కూడా నియంత్రణ చర్యలను పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో 19 హాట్‌స్పాట్లను గుర్తించామని, ఇవి కూడా కర్నూలు, నంద్యాలలోనే అధికంగా ఉన్నాయని తెలిపారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్‌ నిర్ధారణ ల్యాబ్‌ గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో రేపటి నుంచి మొబైల్‌ టీంల ద్వారా శాంపిళ్లను సేకరిస్తామన్నారు.

కోవిడ్‌–19 సర్వేలైన్‌ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో వలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటా సర్వే చేసి అనుమానితులను గుర్తించి హోం ఐసోలేషన్లు, క్వారంటైన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. వీసీలో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, కోవిడ్‌– 19 స్టేట్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ కమాల్‌రాజ్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement