కమ్మని కాఫీ | Sakshi
Sakshi News home page

కమ్మని కాఫీ

Published Fri, Dec 13 2013 12:22 AM

కమ్మని కాఫీ

=మన్యంలో పంటకు జాతీయ గుర్తింపు
 =వచ్చే జనవరిలో పురస్కారం బహూకరణ
 =ఘనత సాధించిన చుట్టుమెట్ట ఎస్టేట్ సిబ్బంది

 
చింతపల్లి, న్యూస్‌లైన్: మన్యంలో కాఫీ సాగు చేపడుతున్న అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కి కమ్మని కబురు అందింది. ఈ సంస్థ పరిధిలో సాగవుతున్న కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పెదబయలు మండలం చుట్టుమెట్ట ఎస్టేట్‌లో పండించిన అరబిక్ కాఫీ గింజలకు అవార్డు దక్కింది. 2003 నుంచి 2012 వరకు పదేళ్లలో ఏడు సార్లు రీజినల్‌స్థాయి అవార్డులు పొందిన ఏజెన్సీ కాఫీకి ఇప్పుడు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. గతేడాది జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, మినుములూరు, అనంతగిరి, అరకులోయ తోటల్లో సాగయిన కాఫీ గింజల శాంపిళ్లను ఏపీఎఫ్‌డీసీ అధికారులు కేంద్ర కాఫీ బోర్డు ద్వారా బెంగళూరులోని అవార్డుల పరిశీలన కమిటీకి పంపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండించిన కాఫీ కంటే విశాఖ మన్యంలోని కాఫీ గింజలే నాణ్యమైనవిగా అక్కడి అధికారులు గుర్తించారు. ఉత్తమ కాఫీగా పెదబయలు కాఫీ గింజలకు పురస్కారం లభించింది. కాఫీ సాగు చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది మన్యంలోని అరబిక కాఫీకి జాతీయ స్థాయి పురస్కారంతోపాటు రీజనల్ స్థాయి ప్రథమ, ద్వితీయ అవార్డులను దక్కాయని ఏపీఎఫ్‌డీసీ జీఎం గురుమూర్తి గురువారం తెలిపారు. అనంతగిరి కాఫీకి ద్వితీయ స్థానం దక్కింది. ఈ అవార్డులను వచ్చే జనవరిలో  కేంద్ర కాఫీ బోర్డు ద్వారా ఏపీఎఫ్‌డీసీకి అందజేస్తారు.

దేశంలో కాఫీ సాగు చేస్తున్న ప్రాంతాలను 12 జోన్‌లుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో సాగవుతున్న ప్రాంతాన్ని అరకు జోన్‌గా గుర్తించారు. ఏటా కాఫీ శాంపిళ్లను ఇక్కడి కాఫీ బోర్డు అధికారులు కేంద్ర కాఫీ బోర్టుకు పంపుతారు. రంగు, రుచి, నాణ్యతను బట్టి రీజనల్, జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైన కాఫీని అంతర్జాతీయ అవార్డుల పరిశీలనకు వారు పంపుతారు.

ఏపీఎఫ్‌డీసీలో పండిస్తున్న కాఫీని మరింత నాణ్యమైనదిగా తయారీకి కొన్నేళ్లుగా ఆ శాఖ అధికారులు శ్రమిస్తున్నారు. అధునాతన పల్పింగ్ యంత్రాలు, నూతన యార్డులు సమకూరుస్తున్నారు. వారి కృషి ఫలితంగా మన్యం కాఫీకి తొలిసారిగా జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఏపీఎఫ్‌డీసీ పరిధిలోని కాఫీకి నాణ్యతా ప్రమాణాల్లో జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషకరంగా ఉందని సంస్థ జీఎం గురుమూర్తి గురువారం  విలేకరులకు తెలిపారు.
 

Advertisement
Advertisement