మరుపురాని రోజు 11.12.13 | Sakshi
Sakshi News home page

మరుపురాని రోజు 11.12.13

Published Wed, Dec 11 2013 9:15 AM

Couples rush to tie nuptial knot on 11.12.13

హైదరాబాద్: మరుపురాని జ్ఞాపకాలను ‘ముడి’ వేయించే రోజు వచ్చేసింది.పవిత్ర ఘడియలను (11-12-13) చిరస్థాయిగా మిగుల్చుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు సిద్ధమవుతున్నారు. ‘నవ’ జీవితానికి నాంది పలికించే శుభ దినంగా ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఈ రోజుకు అత్యంత శక్తి ఉందంటున్నారు వాస్తు, సంఖ్యా నిపుణులు దైవజ్ఞశర్మ. సీక్వెన్స్‌తో కూడిన నెంబర్ కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోవడంతో పాటు.. ఈ రోజు  ఆరంభించే పనుల్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు.                                 
 
అందరికీ శుభం కలుగుతుంది..
11-12-13 సంక్షేమ సంఖ్య. 11 అనేది కవలలకు చిహ్నం. ఈ నేపథ్యంలో ట్విన్స్‌కు ఎంతో మంచి రోజు. మహిళలకు ఇది ప్రత్యేకమైన తేదీ. ఈ రోజున వారు ప్రారంభించే పనుల్లో విజయం వైపు పయనిస్తారు. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల ప్రచారానికి హిల్లరీ క్లింటన్ ఈ అరుదైన తేదీ నుంచే శ్రీకారం చుట్టనున్నారు. కొత్త శాస్త్రీయ పద్ధతులకు, అంతరిక్షంలో కొత్త గ్రహాల అన్వేషణకు అనుకూలమైన రోజు. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి శుభదినం. మధ్యలో నిలిపేసిన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఈ రోజు శ్రేయస్కరంగా ఉందని ఆస్ట్రాలజీ సూచిస్తోంది. ఇక చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు ఇదో మంచి తరుణం.
 
కొత్త పనులకు శ్రీకారం..
11-12-13ను కూడితే చైనీయులు బలంగా విశ్వసించే లక్కీనెంబర్ 9 రావడం మరో విశేషం. చైనీయుల సెంటిమెంట్‌ను అనుసరించే భారతీయులు సైతం ఈ నెంబర్‌నే అదృష్ట సంఖ్యగా భావిస్తారు. స్వీక్వెన్స్ డేట్‌తో ప్రత్యేకమైన రోజుకు తోడు లక్కీనెంబర్ కలిసి వస్తోంది.  ఇంకో విశేషమేమంటే లక్కీనెంబర్ తొమ్మిదో తిథి నవమి రావడం. స్పెషల్ డేట్‌తో పాటు సంఖ్యాపరంగా లక్కీనెంబర్ కలిసి రావడంతో కొత్త పనులను శ్రీకారం చుట్టేందుకు అనువైన రోజుగా భావిస్తున్నారు.
 
కలసివచ్చిన ముహుర్తం
ప్రత్యేకమైన తేదీతో పాటు 11వ తేదీన బలమైన ముహుర్తం వచ్చిందని న్యూమరాలజిస్ట్ గుళ్లపల్లి వెంకట లక్ష్మిపతి దీక్షితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11-12-13 సంక్షేమ సంఖ్యకు తోడు లక్కీనెంబర్, బలమైన ముహుర్తం కలిసిరావడంతో పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉందంటున్నారు.  ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
 
ఘనమైన తేదీన జన్మనిచ్చేందుకు
ఈ ప్రత్యేకమైన రోజున కొందరు బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు ఖరారు చేసుకున్నారు. ఇందుకోసం పలువురు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకునేందుకు సైతం సిద్ధమయినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement
Advertisement