మోసపూరిత ప్రకటనలు మానుకో బాబూ | Sakshi
Sakshi News home page

మోసపూరిత ప్రకటనలు మానుకో బాబూ

Published Mon, Jun 23 2014 3:28 AM

మోసపూరిత ప్రకటనలు మానుకో బాబూ - Sakshi

 శ్రీకాకుళం అర్బన్ : ‘చంద్రబాబూ మోసపూరిత ప్రకటనలు మానుకో.. రైతులను రుణమాఫీ పేరుతో నమ్మించి నట్టేట ముంచుతున్నావ్.. ఆశలు కల్పిస్తున్నావ్.. ఇచ్చిన హామీలను అమలు చేసి మంచి నాయకుడిగా నిరూపించుకో..లేకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్’ అని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలపై నిర్లక్షం చేయడం చంద్రబాబుకు తగదన్నారు. జిల్లాలో 1.85 లక్షల హెక్టార్లకు 1.45 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ప్రతిపాదనలు మాత్రం 84వేల క్వింటాళ్లకు మాత్రమే పంపించారని, వాటిని కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడం ఘరోమన్నారు. 1001 రకం విత్తనాలు 40వేల టన్నులు అవసరం కాగా 8,800 టన్నుల విత్తనాలకు ప్రతిపాదనలు పంపి కేవలం 3,975 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే పంపిణీ చేశారని అధికారుల తీరును విమర్శించారు.
 
 ‘పోకిరీ మాటలు తగ్గించి, నిజాయితీగా మీరిచ్చిన హామీలు అమలు పర్చండి. హామీ ఇచ్చినప్పుడు కేంద్రాన్ని అడిగి ఇచ్చారా..ఆర్‌బీఐ గైడ్‌లైన్స్, కమిటీ నివేదిక అనంతరం రుణ మాఫీ చేస్తానని చెప్పలేదు. పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పావని విమర్శించారు. వైఎస్ హయాంలో షరతులు లేని రుణమాఫీ చేశారని, ఇప్పుడు కూడా అదే పద్దతి అవలంభించాలన్నారు. ఎటువంటి రుణాలు చెల్లించవద్దని బాబు రైతులకు ఎన్నికల్లో హామీ నిచ్చారని, అధికారం చేపట్టిన తరువాత మొదటి సంతకాన్ని రుణామాఫీపై కాకుండా కమిటీపై పెట్టడం రైతులకు మోసగించడమేనన్నారు.  ‘రుణమాఫీపై టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చావ్..ప్రజలు ఇప్పుడు ఫోన్ చేస్తారు..ఏం సమాధానం చెబుతావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఉదయించే సూర్యుడని, ప్రజలను మోసగించ లేకే నిజాయితీగా రుణమాఫీ చేయలేమని చె ప్పారన్నారు. ‘బాబు వస్తే జాబు గ్యారంటీ’ అని చెప్పి ఉన్న ఉద్యోగాలను పీకి వేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో 6,500 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధపడుతున్నారన్నారు.జెడ్పీటీసీలను కూడా పార్టీ మారాలంటూ ఒత్తిడి చేయడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదన్నారు. గోద్రా ఘటనలో మోడీని విమర్శించి బీజీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. బాబు లాంటి మోసగాడిని ప్రజలు ఎన్నుకున్నారని, కొత్త తరానికి బాబు గూరించి తెలియకపోయినా ఆయన్ని సమీపం నుంచి చూసిన తనకు మాత్రం తెలుసనని సీతారం అన్నారు. బాబు మోసాల్ని త్వరలోనే ప్రజలు గ్రిహ ంచి పోరాటాలకు సిద్ధపడతారన్నారు.
 
 వీటన్నింటిపై పోరాడేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఒక ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను చేపట్టనుందన్నారు. రైతులను, డ్వాక్రా మహిళలను, పలు ప్రజాసంఘాలను, విద్యార్థులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కలుపుకొని ప్రజల పక్షాన పోరాడతామన్నారు. త్వరలోనే కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నామని, ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, మొదలవలస లీలామోహన్, ఎమ్మార్పీఎస్ నేత ఎం.కిరణ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement