తెలంగాణపై చర్చలతో వేడెక్కిన ఢిల్లీ | Sakshi
Sakshi News home page

తెలంగాణపై చర్చలతో వేడెక్కిన ఢిల్లీ

Published Thu, Dec 5 2013 1:41 PM

తెలంగాణపై చర్చలతో వేడెక్కిన ఢిల్లీ - Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణ, రాయలతెలంగాణ అంశాలపై చర్చలతో ఢిల్లీ వేడెక్కింది. ప్రధాన మంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, ఎంపిలు, ప్రధాన ప్రతిపక్షమైన బిజేపి నేతలు ఇదే అంశంపై చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అనుసరించవలసి వ్యూహం, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

కోర్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేరుగా నార్త్బ్లాక్కు చేరుకున్నారు. జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ షిండేతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయమే వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా, తెలంగాణ ఎంపిలు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. పది జిల్లాల తెలంగాణ మాత్రమే కావాలని కోరారు. మరోవైపు తెలంగాణ జెఏసీ నేతలు  కోదండరామ్ నాయకత్వంలో బిజేపి నాయకురాలు సుష్మాస్వరాజ్ను కలిశారు. రాయలతెలంగాణకు అంగీకరించవద్దని వారు ఆమెను కోరారు.రాయలతెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తిలేదని ఆమె వారికి హామీ ఇచ్చారు. పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంకోవైపు రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషిస్తున్న  జిఓఎం సభ్యుడు  జైరామ్ రమేష్ బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడును కలిసి రాయలతెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించమని నచ్చచెబుతున్నట్లు తెలిసింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమై ఇదే అంశంపై చర్చిస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశం కూడా తెలంగాణ బిల్లుపైనే చర్చిస్తుంది. తెలంగాణపై కేంద్ర మంత్రులు తలా ఒక మాట మాట్లాడటం, గందరగోళాన్ని సృష్టించడం విమర్శలకు దారి తీస్తోంది.  ఒక రాష్ట్రాన్ని విభజించే అంశాన్ని స్పష్టంగా తెలియజేయకుండా  కేంద్రం ఇంత గోప్యంగా ఉంచడాన్ని పలువురు నేతలు తప్పుపడుతున్నారు.

Advertisement
Advertisement