బాబుపై ఉక్రోషంతో దాడి చేయిస్తారా? | Sakshi
Sakshi News home page

బాబుపై ఉక్రోషంతో దాడి చేయిస్తారా?

Published Sat, Feb 14 2015 12:50 AM

బాబుపై ఉక్రోషంతో దాడి చేయిస్తారా?

ఏపీ మంత్రి దేవినేని మండిపాటు

సాక్షి, విజయవాడ: నాగార్జునసాగర్ జలాల విషయంలో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తెలంగాణలోని వరంగల్‌లో పర్యటిస్తే మీకెందుకంత ఉక్రోషమంటూ ఆ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులతో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చి మా అధికారులు, పోలీసులపై దాడి చేయిస్తారా? అని ధ్వజమెత్తారు. ఇది చట్టబద్ధమైన చర్య కాదన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకోసం నీరు విడుదల చేసేవరకు తమ రాష్ట్ర నీటిపారుదలశాఖ, రెవెన్యూ, పోలీసులు నాగార్జునసాగర్ వద్దే ఉండి ప్రయత్నాలు చేస్తారని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం రాత్రి విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వ చర్యలవల్ల గుంటూరు, కృష్ణా జిల్లా, కృష్ణా డెల్టా, ప్రకాశం జిల్లాలోని ఐదు లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు, 1.49 లక్షల ఎకరాల్లో వరికి నష్టం కలుగుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు వరంగల్ వచ్చారనేగా..  విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీటి కేటాయింపుల విషయంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, బచావత్ ట్రిబ్యునల్ వద్ద, కృష్ణా బోర్డులోనూ ఈ వ్యవహారం ఉన్నప్పటికీ ఎందుకిలా చేయడమన్నారు.

తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కేటాయించిన 99 టీఎంసీల నీటిని దాటి 15 టీఎంసీలను వారు ఎక్కువగా వినియోగించుకున్నారని, కృష్ణా డెల్టాకు 38 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా 15 టీఎంసీలే ఇప్పటికి వచ్చిందని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ నెలాఖరుకు, ప్రకాశం జిల్లాలో వచ్చేనెల 15 నాటికి ఖరీఫ్ పూర్తవుతుందని చెప్పారు. పంటలు చివరి దశలో ఉన్నప్పుడు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, దీనికోసం రోజుకు 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నెలరోజులుగా కోరుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పారు.

హరీశ్‌రావుతో మాట్లాడా...
తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో శుక్రవారం తాను మాట్లాడి పరిస్థితిని వివరించి నీటిని విడుదల చేయాలని కోరానని ఉమా చెప్పారు. ఇందుకు బోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా పంపిస్తున్నానని చెప్పానన్నారు.  45 టీఎంసీలను రెండు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకోవాలంటూ, రెండు రాష్ట్రాల్లో రైతులందరికీ న్యాయం జరగాలనేదే తమ అభిమతమని ఆయన చెప్పారు. తమపై కోపంతో కృష్ణా డెల్టా కన్ను పొడవాలని తెలంగాణ యత్నించటం సరికాదన్నారు. 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయకుండా 2 వేల క్యూసెక్కులను కాలువలద్వారా పులిచింతలకు పంపటం సరికాదన్నారు. పంతాలు, పట్టింపులు మానుకోవాలని, చట్టబద్ధంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారును ఆయన కోరారు.

Advertisement
Advertisement