గ్రేటర్‌లో విలీనం వద్దు | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో విలీనం వద్దు

Published Sun, Sep 8 2013 11:47 PM

do notwant to  merge medchal in GHMC

 మేడ్చల్ రూరల్, న్యూస్‌లైన్:
 శివారు గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గుండ్లపోచంపల్లిలోని జాతీయ రహదారిపై ఆదివారం అఖిలపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మండలంలోని గుండ్లపోచంపల్లి పంచాయతీని గ్రేటర్‌లో విలీనం చేస్తూ ఈ నెల 5న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకోవడానికి 6వ తేదీన జీహెచ్‌ఎంసీ అధికారులు పంచాయతీ కార్యాలయానికి వచ్చారు.
 
  ప్రజలు వీరిపై తిరగబడి నిర్బంధించారు. చివరికి పోలీసుల సహాయంలో రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో గుండ్లపోచంపల్లి పంచాయతీని గ్రేటర్‌లో విలీనం చేయకూడదంటూ ఆదివారం అఖిలపక్ష నాయకులు,  కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి గ్రామ నాయకులతో కలిసి గ్రామ సమీపంలోని 44 వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న  పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలాని వచ్చారు. నాయకులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. కాసేపు  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు నాయకులను పోలీస్టేషన్‌కు తరలించారు. నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, విక్రంరెడ్డి, మోహన్‌రెడ్డి, నరేందర్, క్రిష్టారెడ్డి, కిషన్, ఈశ్వర్, కొంపల్లి నాయకులు మోహన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాజిరెడ్డి, దేవేందర్,శ్రీనివాస్‌రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.
 
 విలీనం.. కుట్రలో భాగం
 గుండ్లపోచంపల్లి గ్రామాన్ని గ్రేటర్‌లో విలీనం చేసి పేద ప్రజలకు పన్నుల భారం మోపుతారా అని ధర్నాలో పాల్లొన్న నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా గ్రేటర్‌లో పంచాయతీలను విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశంతోనే విలీననాన్ని చేపడుతున్నారని దుయ్యబట్టారు.  
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాలకు అనుగుణంగా విలీన ప్రక్రియ కొనసాగుతోందని ఆరోపించారు.  హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు ఢిల్లీలో సీమాంధ్ర నేతలు కుమ్మక్కై కుట్రలు పన్నుతూ.. శివారు గ్రామాల విలీన ప్రక్రియ చేపట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే విలీనం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
 

Advertisement
Advertisement