ఆడ...పిల్ల ఆహారమైంది! | Sakshi
Sakshi News home page

ఆడ...పిల్ల ఆహారమైంది!

Published Sat, Jan 11 2014 11:12 AM

ఆడ...పిల్ల ఆహారమైంది! - Sakshi

కడప రిమ్స్ ప్రాంగణం... శుక్రవారం... ఉదయం 11.25 గంటలు... ఓ కుక్క తలలేని ఆడశిశువు మృతదేహాన్ని నోట కరుచుకుని కనిపించింది. అటుగా వెళ్తున్న వారు కుక్కను ఆపేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. అది వేగంగా కాంపౌండ్ను దాటి ఎదురుగా ఉన్న ముళ్లపొదల్లోకి వెళ్లిపోయింది. కొందరు అక్కడికి వెళ్లేసరికి కుక్క కనిపించలేదు...శిశువు మృతదేహమూ లేదు.

ఆడపిల్ల అని వదిలించుకున్నారా? లేక....

కుక్క నోట చిక్కిన చిట్టి ప్రాణం ఎవరిదనే విషయం సందిగ్ధంగా మారింది. ఆస్పత్రి వర్గాలను ఆరా తీస్తే సమాచారం లభించలేదు. ఫోటో చూస్తే రోజుల పిల్ల అని తెలుస్తోంది. తల లేకపోవడాన్ని బట్టి చూస్తే ఈ కుక్క కంటే ముందే మరో  జంతువు బారిన పండిందని తేలుతోంది. అయితే పాప శరీరానికి, బట్టలకు మట్టి అంటకపోవడంతో బతికుండగానే పడేశారనే అనుమానం తలెత్తుతోంది. ఇటీవల కొంతమంది ఆడపిల్ల జన్మిస్తే రిమ్స్ ప్రాంగణంలో వదిలేసి వెళ్తున్నారు. అలాగే చిన్నారులు చనిపోతే కొందరు పాతిపెట్టకుండా డెంటల్ కాలేజీ, మార్చురీ సమీపంలోని ముళ్లపొదల్లోకి విసిరేస్తున్నారు. ఆడ పిల్లను కనాలా వద్దా అనే ఆలోచిస్తున్న ఈ సందిగ్ధ సందర్భంలో శునకాలకు ఆహారంగా మారిన పసికందు ఓ ప్రశ్నగా మారింది.

బతికిన శిశువును కుక్కలు చంపేసి తీసుకెళ్తాయా? లేదా చనిపోయిన మృతదేహాన్ని కుక్క నోట తీసుకెళ్లిందా? అనేది అంతుపట్టడం లేదు. ఇదే విషయాన్ని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్ వద్ద ప్రస్తావించగా... ఆస్పత్రిలో కుక్కలు వచ్చే ప్రసక్తే లేదని... బతికున్న శిశువులను తీసుకెళ్తే అవకాశం లేదన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయం మృతి చెందిన శిశువులను అంతిమ సంస్కారాలు నిర్వహించాలనుకుంటే వారికి అప్పగిస్తామని, లేదంటే బయోవేస్ట్ కింద తాడిపత్రికి పంపిస్తామన్నారు. అక్కడ వాటిని దహనం చేస్తారని గౌరవ్ తెలిపారు. సంఘటనకు కారణమేమిటనేది విచారణ జరుపుతామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement