కుక్కల దాడి | Sakshi
Sakshi News home page

కుక్కల దాడి

Published Mon, Sep 7 2015 2:56 AM

కుక్కల దాడి - Sakshi

ఐదు కుక్కలు.. ఒక బాలుడు.. ఒక్కసారిగా అన్ని కుక్కలు చుట్టుముట్టి మీదపడి కొరికేస్తుంటే ఆ బాలుడేం చేస్తాడు పాపం. అమ్మా అంటూ ఏడుస్తూ గట్టిగా అరవడం తప్ప. అవును.. దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామ శివారులో ఆదివారం ఇదే జరిగింది.
 
 ప్రొద్దుటూరు క్రైం :  ముజమ్మిల్ (8) అనే పసి బాలుడిని ఐదు కుక్కలు చుట్టుముట్టి కసితీరా కరిచాయి. కుక్కల దాడిలో బాలుడికి  ఒళ్లంతా గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎర్రబల్లెకు చెందిన ముల్లా జమాల్‌వల్లి బేల్‌దార్ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు ముజమ్మిల్  మూడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో అతను ఇంటి వద్దనే ఉన్నాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు దండించడంతో అతను ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. చాలా సేపు ఏడుస్తూ ఇంటి బయట నిలుచున్నాడు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో బాలుడి అవ్వా తాతలు ఉన్నారు.  వారి వద్దకు వెళ్లేందుకు ముజమ్మిల్ నడుచుకుంటూ బయలుదేరాడు.

 చుట్టుముట్టిన ఐదు కుక్కలు..
     ఎర్రబల్లె గ్రామ శివారులోకి రాగానే ఐదు కుక్కలు బాలుడ్ని చుట్టు ముట్టాయి. భయ పడిన ముజమ్మిల్ పరుగులు తీశాడు. అయినప్పటికీ కుక్కలు వదలకుండా వెంబడించాయి. కొద్ది దూరం పరుగెత్తిన బాలుడు తర్వాత అలసిపోయి కింద పడిపోయాడు. ఐదు కుక్కలు ఒక్కసారిగా బాలుడిని కరిచాయి. అదే దారి వెంట వెళ్తున్న వంశీ అనే బాలుడు పడిపోయిన ముజమ్మిల్‌ను చూసి దగ్గరికి వెళ్లబోయాడు. ఓ కుక్క వంశీని కూడా వెంటాడింది.

దీంతో వంశీ గ్రామంలోకి వెళ్లి వరప్రసాద్, వీరయ్య అనే వ్యక్తులకు పిలుచుకొని వచ్చాడు. వారు వచ్చే సరికి బాలుడు తీవ్ర రక్త గాయాలతో పడిపోయి ఉన్నాడు. వరప్రసాద్, వీరయ్యలు వెంటనే మోటర్ బైక్‌లో బాలుడ్ని ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. ఒళ్లంతా కుక్క కాట్లు ఉండటమేగాక పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైద్యుడి సూచన మేరకు కడప రిమ్స్‌కు తరలించారు. బాలుడ్ని చూడటానికి ఎర్రబల్లె గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.

 గ్రామంలో కుక్కల బెడద..
     ఎర్రబల్లె గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉండటంతో చిన్న పిల్లలు బయటికి రావాలంటేనే భయ పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. పాఠశాల, దుకాణాలకు వెళ్లాలంటే పిల్లలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకొని కుక్కల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
 
  జిల్లాలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. పాదచారులు, వాహనదారులను కుక్కలు వెంటాడి మరీ కరుస్తున్నాయని పత్రికల్లో అనేక కథనాలు వచ్చినా అధికారుల్లో చలనం లే దు. ఆ కుక్కల్ని చంపమని ఎవరూ అడగలేదు.. వాటిని తీసుకెళ్లి ఏ అడవిలోనో.. జన సంచారం లేని ప్రాంతంలోనో వదిలేసి రమ్మని వేడుకుంటున్నా ఆలకించే నాథుడు కరువయ్యాడు. పగటిపూట ఒక ఎత్తయితే రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనాల్లో వెళ్లే వారిని కుక్కలు వెంటపడుతుండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడిన వారు ఎంతో మంది ఉన్నారు.

కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, జమ్మలమడుగు ఇలా ప్రతి చోటా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కకాటుకు గురైన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన మందు కూడా చాలా చోట్ల ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో లేదు. ఇకనైనా అధికారులు స్పందించి జిల్లాలో కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement