Sakshi News home page

అయ్యో.. పాపం రోశమ్మ!!

Published Tue, Jul 29 2014 12:27 PM

అయ్యో.. పాపం రోశమ్మ!! - Sakshi

దూబగుంట రోశమ్మ... ఈ పేరు వింటేనే ఉద్యమకారులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1993 ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగిన సారా వ్యతిరేకోద్యమానికి నెల్లూరు జిల్లా దూబగుంట అనే కుగ్రామంలో శ్రీకారం చుట్టిన ధీరవనిత ఆమె. అప్పట్లో ఏ గ్రామంలోనైనా సరే.. సారా అమ్ముతున్నట్లు కనపడితే చాలు, మహిళలు అపర కాళికలుగా మారి దుకాణాలను ధ్వంసం చేసేవారు. ఆమె ఉద్యమ ఫలితంగానే దివంగత ఎన్టీఆర్ తాను గెలిచిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని విధించారు. అప్పట్లో ఆమెకు ఎంతో సాయం చేస్తామని పాలకులు హామీలిచ్చారు. కాలక్రమంలో వాటిని మరిచిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం కాస్తా గాలికి పోయింది.

అప్పట్లో ఉవ్వెత్తున ఉద్యమం చేసిన రోశమ్మ.. ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నారు. ఉద్యమకర్తగా ఆమెకు పేరు మిగిలిందే తప్ప ఇబ్బందులు తొలగలేదు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు గానీ, అనారోగ్యం వెంటాడుతోనే ఉంది. ఈ నేపథ్యంలో తనకు నివాస స్థలం, మనుమరాలికి కలెక్టర్ ఏదైనా ఉద్యోగం చూపిస్తారేమోనని గంపెడాశతో రోశమ్మ కలెక్టరేట్కు వెళ్లారు. అయితే కలెక్టర్ సెలవులో ఉన్న విషయం తెలిసి నీరసపడ్డారు. ఎక్కడికీ నడవలేక ఊతకర్ర సాయంతో అతికష్టంపై మెట్లమీద కూర్చున్నారు. ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. రోశమ్మ ఉద్యమస్ఫూర్తి తెలిసిన ఒకరిద్దరు అయ్యో.. దూబగుంట రోశమ్మ కదా.. ఆమెకు ఎంత కష్టం వచ్చిందో అని వాపోయారు.

Advertisement

What’s your opinion

Advertisement