గుండె కోత | Sakshi
Sakshi News home page

గుండె కోత

Published Thu, Dec 19 2013 3:09 AM

due to the heavy rains formers felt loss in Agriculture

 సాక్షి, కడప : నందలూరు మండలం నల్లదిమ్మాయపల్లె గ్రామంలో అధికారులు పంటకోత ప్రయోగాలుచేస్తే ఎకరాకు దాదాపు 765 కేజీల దిగుబడిమాత్రమే వచ్చింది.  ఎకరాకు 10 బస్తాల దిగుబడి మాత్రమే రావడం గమనార్హం.
 
  చెన్నూరులో పంట కోత ప్రయోగాలు చేస్తే ఎకరాకు 988 కేజీల దిగుబడి మాత్రమే వచ్చింది. తుపాన్ కారణంగా ఎక్కువ తాలు పోయినట్లు రైతులు వాపోతున్నారు.  
 
 జిల్లాలో ఈ ఏడాది వరి సాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. తెల్లదోమ, అగ్గితెగులుతో పాటు తుపాన్‌ల ధాటికి అన్నదాతలు విలవిల్లాడారు.  పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరాకు 2 నుంచి 20 బస్తాలలోపే సరాసరిన పంట దిగుబడి వచ్చే పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇటీవల జిల్లాలో చేపట్టిన పంటకోత ప్రయోగాల్లో ఈ వాస్తవాలు వెల్లడైనట్లు సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,16,375 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు.  సరాసరిన  ఎకరాకు రూ. 15 నుంచి రూ. 20 వేల పెట్టుబడులు పెట్టారు.  సాధారణంగా ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉంది.
 
 సరాసరిన 20 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తారు. ఇలా వస్తే కనీసం పెట్టుబడులతో నష్టాలు లేకుండా గట్టేక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి ధాన్యం బస్తా రూ. 1200  పలుకుతోంది. పంట కోత ప్రయోగాల లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది రైతుకు కనీసం పంట పెట్టుబడులు కూడా రావడం గగనమే. గత ఏడాది మాదిరిగానే  ఈ ఏడాది కూడా వరి రైతుకు గుండె‘కోత’నే మిగిల్చింది.
 
 పంట కోత ప్రయోగాలిలా...
 వరికి  పంటల బీమాకు సంబంధించి గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. జిల్లాలోని 51మండలాల్లోని  228 గ్రామాల్లో సరాసరిన 1224 చోట్ల 5 ఇన్‌టు 5 విస్తీర్ణంలో పంటకోత ప్రయోగాలు చేస్తారు. ప్రతి గ్రామంలో నాలుగు చోట్ల 5 ఇన్‌టు 5 విస్తీర్ణంలో పంటకోత ప్రయోగాలు చేసి ఎకరాకు 162 ప్లాట్లుగా చేసి సరాసరిన దిగుబడిని లెక్కగడతారు. ఈ దిగుబడి వివరాలను ప్రభుత్వానికి పంపుతారు. వీటి ఆధారంగా జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం (ఎన్‌ఏఐఎస్)  రైతులకు పంటల బీమాను చెల్లిస్తుంది.
 
 ప్రభుత్వ అంచనాల ప్రకారం 5 ఇన్ టు 5మీటర్ల విస్తీర్ణంలో 16 కేజీలు అంటే ఎకరాకు 1875 కేజీల వరి ధాన్యం రావాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఈఏడాది కొన్ని మండలాల్లో 2 నుంచి 10 బస్తాలలోపే పంట దిగుబడి రావడం గమనార్హం. దీంతో అన్నదాతలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంట రుణాలు ఇచ్చి తమను ఆదుకోవాలని  విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement
Advertisement