Sakshi News home page

ఎడ్యుకేషన్ న్యూస్

Published Fri, Oct 18 2013 3:16 AM

Education Alert messages

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పెంపు
 సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఏ, బీకాం, బీఎస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకూ పొడిగించినట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు నవంబర్ 9 నుంచి 15 వరకూ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నవంబర్ 17 నుంచి 22 వరకూ, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 24 నుంచి 27 వరకూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  
 
 24 వృత్తి విద్య కాలేజీలకు ఫీజుల ఖరారు
 సాక్షి, హైదరాబాద్: వ్యయ నివేదికలు సమర్పించని 24 వృత్తి విద్యా కళాశాలలకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) ఫీజులు నిర్ధారించని విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఆయా కళాశాలలకు 2013-14, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకుగాను ఏఎఫ్‌ఆర్సీ ఫీజును ఖరారు చేసింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఎంటెక్ కళాశాలలకు ఫీజు రూ. 48,500, 8 ఎం ఫార్మసీ కళాశాలలకు రూ. 98,500, 2 బీ ఫార్మసీ కళాశాలకు ఫీజు రూ. 26,500, ఒక బీ.ఫార్మసీ కళాశాలకు రూ. 30 వేలుగా నిర్ణయించింది.
 
 ‘లైబ్రరీ సైన్స్’ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
 సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్టు ప్రజాగ్రంథాలయాల శాఖ సంచాలకులు సి.హెచ్.పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులు. దరఖాస్తులను ఆయా ఇనిస్టిట్యూట్ల ప్రిన్సిపాల్స్‌కు నవంబర్ 15లోగా పంపించాలి.
 
 మార్చి 27 నుంచి టెన్త్ పరీక్షలు?
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే మార్చి 27 లేదా 28 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రెండు రోజులు ముందుగా మార్చి 27 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు  తెలిపాయి.
 
 త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష!
 10 రోజుల్లో షెడ్యూలు జారీ అయ్యే అవకాశం
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు మాధ్యమిక విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. సీమాంధ్ర  ఉద్యోగుల సమ్మె విరమణ నేపథ్యంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథితో చర్చించి పది రోజుల్లో టెట్ షెడ్యూలు జారీ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెట్ కేవలం అర్హత పరీక్షే కానీ ఉద్యోగ నియామక పరీక్ష కాదని, ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాబోవని ఆ వర్గాలు తెలిపాయి.
 
 బీఈడీ ‘థర్డ్ మెథడాలజీ’లో ప్రవేశాలకు దరఖాస్తులు
 హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బీఈడీ కళాశాలలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న బీఈడీ థర్డ్ మెథడాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలలో టీచర్ ఉద్యోగాలు చేసేవారు, బీఈడీ పూర్తి చేసినవారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. నవంబర్ 23 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
 
 నేటి నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల బోధన సిబ్బంది సమ్మె విరమించడంతో శుక్రవారం నుంచి తరగతులు నిర్వహించనున్నామని సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement