Sakshi News home page

పచ్చ పాలన!

Published Mon, Jul 28 2014 2:34 AM

పచ్చ పాలన!

 ‘మీపై ఫిర్యాదులొస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. మీకే మంచిది. లేదంటే విచారణ, ఆపై కేసులు బనాయించి డీలర్‌షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంది. అర్థం చేసుకొని రాజీనామా చేయండి. లేకుంటే సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు.’
 -రేషన్‌షాపు డీలర్లను హెచ్చరించిన ఒంటిమిట్ట తహశీల్దార్ ఈశ్వరయ్య
 
 తహశీల్దార్లు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి పైరవీలతో పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. అందుకే అలా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ రాజకీయ నేతల జోక్యం తప్పడంలేదు. అధికార పార్టీకి తలొగ్గాల్సి వస్తోంది.    
 - ఓ ఉన్నతస్థాయి అధికారి అభిప్రాయం
 
 సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పాలనకు అధికారుల వైఖరి అద్దం పడుతోంది. అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లా యంత్రాంగం మసలుకుంటోందని రూఢీ అవుతోంది. తహశీల్దార్లను గాడిలో పెట్టాల్సిన ఉన్నతాధికారులు వారిని సమర్థిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలుకుతున్నారు. పచ్చ చొక్కా నేతల మెప్పు కోసం తహతహలాడుతున్నారు. నాయకుల మాటే వేదంగా తలాడిస్తూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆదేశాలను జీ..హుజూర్ అంటూ నిస్సిగ్గుగా పాటిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉంది.
 
 రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పెత్తనం పెరిగింది. వీరికి అధికార యంత్రాంగం కూడా వంత పాడుతోంది. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. జిల్లాలో 1750 రేషన్‌షాపు డీలర్‌షిప్‌లుంటే సుమారు 250 చోట్ల ఖాళీలున్నాయి.
 
 ఆయా స్థానాల్లో ఇన్‌ఛార్జులు కొనసాగుతున్నారు. అర్హతల ఆధారంగాా ఆ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన వారిని నియమించినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఉన్న డీలర్లను అకారణంగా తొలగించాలనుకోవడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
 
 జిల్లాలో జమ్మలమడుగు డివిజన్‌లో తొలుత ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు గత నెల 30న జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో తాత్కాలికంగా అప్పట్లో డీలర్ల తొలగింపు కార్యక్రమానికి తెర పడింది.
 
 అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ మెప్పుకోసమే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగా తహశీల్దార్లు ప్రత్యక్షంగా డీలర్లను వేధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన అధికారులు పచ్చ రంగు పులుముకుంటున్నారు. పర్యవసానంగా జిల్లాలో పరిపాలన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కొనసాగుతోంది. అధికారులు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ విధులు నిర్వర్తించాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement