బదిలీ కోసం ఆత్రంగా.. | Sakshi
Sakshi News home page

బదిలీ కోసం ఆత్రంగా..

Published Fri, Jun 10 2016 12:52 PM

employees transfers in vizianagaram district

 అధికారులు, ఉద్యోగుల ఎదురుచూపులు
 ఇంకా విడుదల కాని జీఓ  

విజయనగరం కంటోన్మెంట్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీఓ గురువారం సాయంత్రం వరకూ విడుదల కాలేదు. చాలా రోజులుగా బదిలీల జీఓ కోసం ఎదురు చూస్తున్న అధికారులు, ఉద్యోగులు జీఓ రాకపోవడంపై నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నుంచి జీఓ వస్తుందని ఎదురు చూస్తున్న విజయనగరం జిల్లా అధికారులు, ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది కూడా గురువారం సాయంత్రం వరకూ జీఓపై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకూ బదిలీలు నిర్వహించుకోవాలని త్వరలోనే జీఓ విడుదల చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించినా జీఓ విడుదల చేయక పోవడం విచిత్రంగా ఉందని పలు ఉద్యోగ సంఘాలు విమర్శించాయి.

 నీరుగారిన ఉత్సాహం
ఇటీవల జూన్ మొదటి వారంలోనే బదిలీలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ దానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమైన తరువాత ఈనెల పది నుంచి బదిలీలు నిర్వహిస్తామని స్వయంగా ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో సంతోషం పెల్లుబికింది. చాలామంది అధికారులు, ఉద్యోగులు, ఆయా సంఘాల నాయకులు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని, ప్రస్తుత విధానంలో రాజకీయ నాయకుల వెంట తిరగలేకపోతున్నామని చె ప్పడంతో ఈ జీఓలో కొన్ని మార్పు చేర్పులు ఉంటాయని పలువురు భావించారు. ఈ మార్పుల కోసమే చివరి క్షణం వరకూ   జీఓ విడుదల చేయలేదని అంటున్నారు. అయితే ఈనెల పదో తేదీనుంచి బదిలీలు చేపట్టాలని నిర్ణయిం చిన పక్షంలో ముందు రోజు రాత్రి వరకూ జీఓ విడుదల చేయకపోవడంతో ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. మండల, జిల్లా స్థాయిలో తాము కోరుకున్న స్థానాల కోసం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వారి నుంచి హామీలు తీసుకున్నారు.

చివరకూ జీఓ విడుదల కాకపోవడంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి విడుదల చేయాల్సిన జీఓ విషయంలోనూ ఇంత గోప్యత ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గురువారం ఏ అర్ధరాత్రికో లేక శుక్రవారమైనా జీఓ విడుదలవుతుందా లేక గతంలోలా ఉద్యోగులకు మళ్లీ వాయిదా వేస్తారా? అని ఆయా ఉద్యోగులు, అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీఓ విడుదలయిన పక్షంలో జిల్లాలో కొన్ని స్థానాలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు పైరవీలు చేసుకున్న వారు కూడా నేనంటే నేనే చేరతాననే ధీమాతో ఉన్నారు. ఏదైనా జీఓపైనే ఆధారపడి ఉందని,  ఏ క్షణమైనా జీఓ విడుదలయ్యే అవకాశం లేకపోలేదని మరికొంత మంది మెట్ట వేదాంతం చెబుతున్నారు.

Advertisement
Advertisement