‘బిల్లు’ పడుద్ది! | Sakshi
Sakshi News home page

‘బిల్లు’ పడుద్ది!

Published Wed, Dec 4 2013 3:04 AM

exercise department kept rule new policy sales of alcohol

సాక్షి, కడప: మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్‌శాఖ శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యాన్ని నివారించే చర్యలకు ఉపక్రమించింది. సర్కారీ మద్యంలో నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. మద్యం సీసాలపై హాలోగ్రామ్‌లు వేయడంతో పాటు కొనుగోలుదారుడు ఒక్క ఎస్‌ఎంఎస్‌తో తాను కొన్న సీసా తాలూకూ సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నెంబరును ప్రారంభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తె చ్చిపెడుతున్న ఎక్సైజ్‌శాఖలో సరికొత్త విధానాలను అవలంబించడం ద్వారా సేవలను విస్తృతం చేయడంతో పాటు అక్రమాల నివారణకు అడ్డుకట్ట వే యొచ్చనేది ఈ కొత్త పంథా ప్రధాన ఉద్దేశం.
 
 జనవరి నుంచి కొత్త పంథా?:
 ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త కంప్యూటర్ బిల్లింగ్, హాలోగ్రామ్ విధానం జనవరి నుంచి అమలు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు.
 
 ప్రతి మద్యం సీసాపై హాలోగ్రాము ఏర్పాటు చేస్తారు. దానిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌తో సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు.
  కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపితే చాలు...క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు? ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మకం జరిగింది? అనే వివరాలు అతని ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.
 
  అలాగే ప్రతి మద్యం దుకాణంలో ఆన్‌లైన్ కంప్యూటర్ బిల్లులు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు. మద్యం కొన్న తర్వాత సూపర్‌మార్కెట్ తరహాలో కంప్యూటర్ స్క్రాచ్‌ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలుదారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎక్సైజ్‌కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి.
 
 అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట:
 ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారుచేసి, నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అలాగే కర్నాటక రాష్ట్రం నుంచి అక్కడి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. ట్యాక్స్‌తో పాటు అక్కడి మద్యం ధరలు తక్కువ. దీని ద్వారా కూడా మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు.
 
 ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా వీటిని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. అలాగే నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా దాన్ని తాగిన వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. హాలోగ్రామ్ విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబరు ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నకిలీ మద్యానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
 
 త్వరలోనే కొత్త విధానం:
 నాగలక్ష్మి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ.
 ఆన్‌లైన్, హాలోగ్రామ్ విధానం త్వరలో అమలు కానుంది. మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ బిల్లింగ్ సామగ్రి ఏర్పాటు, మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి సాఫ్ట్‌వేర్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. జనవరి నుంచి కొత్త విధానం అమలయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement