తోడేస్తున్నారు | Sakshi
Sakshi News home page

తోడేస్తున్నారు

Published Thu, Dec 11 2014 2:02 AM

Extracting

సాక్షి, కడప : ఏడాదికొకసారి  పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు అంతంత మాత్రంగానే నీరు.. సాగునీటికి గగనమే.. మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇస్తున్న నీటిని సైతం ‘అనంత’ రైతులు వదలడంలేదు.  అక్రమ మోటార్లను ఏర్పాటు చేసుకుని నీటిని  దోచేస్తున్నారు.  పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు  2014-15కు సంబంధించి అడ్వయిజరీ బోర్డు సమావేశంలో 3.200టీఎంసీల నీటిని కేటాయించారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో     ఆశాజనకంగా నీరు ఉండటంతో ఆగస్ట్ 26న అనంతపురం జిల్లాలోని మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ వద్ద అధికారులు పీబీసీకి  తొలి విడతగా నీటిని  విడుదల చేశారు. అనంతరం రెండవ విడత ఈనెల 6వ తేదీన రెండవమారు విడుదల చేశారు. ముందే అంతంత మాత్రంగా విడుదల చేయడం, కాలువల్లో సగం నీరు వృథా అవుతుండటంతో పాటు  అక్రమ మోటార్ల  కారణంగా  పులివెందుల రైతులతోపాటు ప్రజల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
 
 మోటార్లతో జలదోపిడీ..
 అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి నార్పల మండలంలోని తుంపెర డీప్‌కట్ వరకు సుమారు 80కి.మీ మేర హైలెవల్ కెనాల్ ద్వారా(హెచ్‌ఎల్‌సీ) నీరు పీబీసీకి రావాల్సి ఉంది. మిడ్ పెన్నార్, తుంపెర డీప్‌కట్ల మధ్య లెక్కలేనన్ని అక్రమ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు.   జల దోపిడీ జరుగుతున్నాఅక్కడి యంత్రాంగం చూస్తూ ఊరుకుందే తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదు.  
 
 నీటి విడుదలకు ముందే ఎగువ ప్రాంతంలో ఉన్న 27 చిన్న, చిన్న గేట్లను అధికారులు మూసివేశారు. అయితే వీలు దొరికినప్పుడు స్వల్పంగా  గేట్లు ఎత్తివేసి నీటిని మళ్లించుకుంటున్నట్లు తెలుస్తోంది. మిడ్ పెన్నార్ డ్యాం వద్ద 275  క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తుండగా.. తుంపెర వద్దకు వచ్చేసరికి తక్కువ పరిమాణంలో  రీడింగ్ నమోదవుతోంది. తుంపెర నుంచి పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్(పీబీఆర్) మధ్య కూడా అక్రమ మోటార్లు వెలిశాయి.  మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్ మధ్య దాదాపు  700కు పైగా అక్రమ మోటార్లు వెలిసినట్లు తెలుస్తోంది.
 
 అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల
 అనంతపురం జిల్లాలోని 5వేల ఎకరాలతోపాటు వైఎస్‌ఆర్ జిల్లాలోని 55వేల ఎకరాలను కలుపుకుని సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు కలిగిన పీబీసీకి ప్రస్తుతం సాగునీటికి నీరు  ఇవ్వలేదు. మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇస్తున్న నీటిని అనంతపురం జిల్లాలోని పలువురు రైతులు పంటలకు అందించుకుంటుండటంతో అక్కడ వరి పంట పచ్చగా కళకళలాడుతుండగా.. ఆయకట్టు ప్రాంతమైన పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని భూములు వెలవెలబోతున్నాయి.
 
 తుంపెర వద్ద లష్కర్ల పహారా
 తుంపెర డీప్‌కట్ వద్ద పీబీసీ... అటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కి నీటిని విడుదల చేసే ప్రాంతం. హైలెవెల్ కెనాల్ ద్వారా తుంపెరకు చేరుకుని.. అక్కడి నుంచి పీబీసీకి నీటిని విడుదల చేస్తున్న నేపధ్యంలో టీబీసీ పరిధిలోని రైతులు వచ్చి గేట్లు ఎత్తకుండా లష్కర్లు పహారా కాస్తున్నారు. అయితే తాడిపత్రి ప్రాంతానికి చెందిన రైతులు వచ్చి గేట్లు ఎత్తాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతిసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఏఈతోపాటు లష్కర్లతో పహారా కాస్తున్నారు.  
 
 ఈ విషయమై సంబంధిత ఏఈఈ నరసింహారెడ్డిని వివరణకోరగా అక్రమ నీటి వినియోగం వాస్తవమేనన్నారు. తన రీచ్‌లో 50అక్రమ విద్యుత్ మోటార్లు ఉన్నాయన్నారు. మరో రెండు రీచ్‌ల్లో ఎన్ని మోటార్లు ఉన్నాయో లెక్క తెలియదన్నారు. అక్రమ మోటార్లను  నిరోధించాలని నార్పల, తాడిమర్రి పోలీస్‌స్టేషన్లలో ఐదురోజుల క్రితం ఫిర్యాదు చేశామన్నారు.  ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.
 

Advertisement
Advertisement