ఉద్రిక్తం.. | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తం..

Published Tue, Jan 14 2014 1:40 AM

fighting between congress groups

భువనగిరిటౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన సూర్యాపేట ఎమ్మెల్యే  దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు గంటకుపైగా ధర్నా నిర్వహించారు. కేసునమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 ఇరు వర్గాలపై కేసు నమోదు
 కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేశారని ఎంపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డిపై కేసునమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అలాగే తమను కులం పేరుతో దూషించారని దామోదర్‌రెడ్డి వర్గీయులు ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, సతీష్‌లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
 
 దామోదర్‌రెడ్డి హత్యారాజకీయాలు ఇకసాగవు
 
 భువనగిరి, న్యూస్‌లైన్: జిల్లాలో సూర్యాపేట ఎమ్మెల్యే  దామోదర్‌రెడ్డి హత్యారాజకీయాలు ఇక సాగబోవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలో 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

 వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై స్వయంగా దాడి చేసిన దామోదర్‌రెడ్డి.. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను జిల్లాలో నడుపుతున్నారని ఆరోపించారు. తమసోదరుల జోలికి వచ్చిన ఆర్డీఆర్‌ను సొంత జిల్లా అయిన ఖమ్మంకు పంపించడం ఖాయమన్నారు. ‘‘నీ హత్యా రాజకీ యాలకు ఇక్కడ ఎవరూ బయపడరని.. జిల్లా ప్రజలకు నీవు ఏం చేశావని నీకొడుకును ఎంపీ చేయాలని అనుకుంటున్నావు’’ అని దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నప్పటికీ ఆర్డీఆర్ తన కొడుకును పోటీలో దింపడానికి టికెట్ కోరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల మంచి పేరున్న నూతన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు ఓడిపోయిన చింతల వెంక టేశ్వర్‌రెడ్డికి మరో మారు టికెట్ ఇవ్వొద్దని ఏఐసీసీ దూతను కోరినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కోమటిరెడ్డి సోదరులను ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాలపై ప్రమాణం చేసిన ఆర్డీఆర్.. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవికోసం సీఎం పంచన చేరారని ఆరోపించారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, బర్రె జహంగీర్, భాస్కర్, చంద్రకళ ఉన్నారు.

 ఆర్డీఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలి
 
 నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు దళిత యువకులపై దాడులకు పాల్పడిన సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. ఆర్డీఆర్‌పై అట్రాసిటీ కేసునమోదు చేసి అరెస్టు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. దామోదర్‌రెడ్డి స్వయంగా రౌడీలతో వెళ్లి రాజగోపాల్‌రెడ్డిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

 ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఆర్డీఆర్‌ను జిల్లా ప్రజలు ఆదరించిన విషయాన్ని మరచి  హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గతంలో తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. కిరాయి హత్యలు చేయించే స్వభావం ఉన్న ఆర్డీఆర్.. రాజగోపాల్‌రెడ్డిపై కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతోనే    ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయించామన్నారు. తాము తలుచుకుంటే నార్కట్‌పల్లి మీదుగా సూర్యాపేటకు కూడా వెళ్లలేవని సవాల్ చేశారు. దామోదర్‌రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు.

వెంటనే ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దామోదర్‌రెడ్డి చర్యలకు జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రోత్సాహం ఉందని, వెంటనే మంత్రి తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement