ఆశా..నిరాశేనా? | Sakshi
Sakshi News home page

ఆశా..నిరాశేనా?

Published Thu, Feb 6 2014 3:13 AM

financial strength Given TDP Parvathipuram Ticket

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత సాధారణ ఎన్నికల్లో  పార్వతీపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బొబ్బిలి చిరంజీవులుకు ఈసారి మొండి చేయి తప్పనట్టు ఉంది. ఆర్థిక బలం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉండడంతో పొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితి ఆయనకు ఎదురైంది. టార్గెట్ మేర ఖర్చు చేయలేనని ఆయన చెప్పడంతో స్వచ్ఛందంగా తప్పుకోవాలని, డబ్బున్నోడినే అభ్యర్థిగా నిలబెడదామని సూచనప్రాయంగా పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. 
 
 దీంతో చిరంజీవులు మాస్టారుతో పాటు ఆయన అనుచర వర్గం డీలా పడినట్లు సమాచారం.   టీచర్ పోస్టుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి 2009ఎన్నికల్లో  చిరంజీవులు పోటీ చేశారు. కానీ  ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన్నే నియోజక వర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కుతుంద ని అనుచర వర్గమంతా ఆశలు పెట్టుకుంది. కానీ అధిష్టానం నినాదంతో చిరంజీవులు ఆశలపై నీల్లు జల్లినట్టు అయ్యింది. 
 
 పార్వతీపురంలో బుధవారం ఉదయం జరిగిన  పార్టీ ముఖ్య నేతల రహస్య సమావేశంలో చిరంజీవులు నిరాశకు గురయినట్లు తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ పాల్గొన్న ఈ సమావేశంలో మాస్టారి ఆర్థిక పరిస్థితిపైనే చర్చ జరిగినట్టు సమాచారం. ‘ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, టిక్కెట్ మీకే ఇవ్వాల్సి ఉందని, కాకపోతే ఎంతమేరకు ఖర్చు పెట్ట గలరని’ ఈ సమావేశంలో చిరంజీవులు వద్ద ప్రస్తావించినట్టు భోగట్టా. దీనికి ఆయన బదులిస్తూ రూ.15లక్షలు వరకు ఖర్చు పెట్టగలనని అనగానే ఆ మొత్తం ఎటూ సరిపోదని, గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి డబ్బులు సరిగా ఖర్చు పెట్టకపోవడమే కారణమని పార్టీ అధ్యక్షుడు జగదీష్ హితబోధ చేసినట్టు తెలియవచ్చింది.
 
 అంతేకాకుండా ఐదేళ్లుగా ఇన్‌చార్జ్‌గా మీరు ఉన్నా ఖర్చు అంతా తానే చేశానని, డబ్బులు తీయకపోతే కష్టమేనని జిల్లా అధ్యక్షుడు కరాఖండిగా అన్నట్లు సమా చారం. ఆర్థిక బలం ఉంటేనే నెట్టుకు రాగలమని,స్వచ్ఛందంగా తప్పుకుని పార్టీ కోసం పనిచేస్తే మంచి భవిష్యత్  ఉంటుందని, డబ్బు ఉన్న అభ్యర్థిని వెదుకుదామని జగదీష్ చెప్పినట్టు తెలిసింది. దీంతో చిరంజీవులు మాస్టారు ఒక్కసారిగా డీలా పడ్డట్టు పార్టీ వర్గాల ద్వారా విన్పించిం ది. ఆయనతో పాటే అనుచరులు కూడా నిరుత్సాహానికి గురైనట్టు పార్వతీపురంలో ఇప్పటికే విస్త్రృత ప్రచారం జరుగుతోంది. 
 

Advertisement
Advertisement