యాక్షన్ ప్లాన్ | Sakshi
Sakshi News home page

యాక్షన్ ప్లాన్

Published Fri, Jul 15 2016 12:47 AM

Focus on traffic control

పుష్కరాలకు రవాణా శాఖ  ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
7 స్టేషనరీ కంట్రోల్ రూములు, 5 మొబైల్ కంట్రోల్ టీముల ఏర్పాటు
ఇతర జిల్లాల నుంచి 147 మంది సిబ్బంది కేటాయింపు
తెలంగాణ ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక బృందాలు
 


విజయవాడ : కృష్ణా పుష్కరాలకు జిల్లా రవాణా శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉన్నతాధికారులతోనూ ఆమోదముద్ర వేయించుకుంది. ట్రాఫిక్ నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. వాహనాల ఓవర్‌లోడ్, మితిమీరిన వేగం  నియంత్రణకు మొబైల్ కంట్రోల్ టీములను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో మంగినపూడి బీచ్, అవనిగడ్డ, చెవిటికల్లు, గన్నవరం, ఈడ్పుగల్లు, ఆర్టీసీ బస్టాండ్, విజయవాడ రైల్వేస్టేషన్‌లో స్టేషనరీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుష్కర ఘాట్ల వద్ద ట్రాఫిక్, ఇతర ఇబ్బందులను ఇక్కడి సిబ్బంది పర్యవేక్షిస్తారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు లేదా హోంగార్డులు విధుల్లో ఉంటారు. ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు. ప్రతి రూమ్‌ను ఒక ఎంవీఐ, వీటన్నింటినీ ఆర్టీవో పురేంద్ర పర్యవేక్షిస్తారు.
 
ఐదు మొబైల్ టీంలు..
.
వాహనాల వేగం నియంత్రణకు, కీలక రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించటానికి, ఇబ్బందికర మార్గాల్లో ప్రత్యేక చర్యల పర్యవేక్షణకు ఐదు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరకట్ట మార్గంలో కృష్ణలంక నుంచి మోపిదేవి వరకు, వేదాద్రి నుంచి ముక్తేశ్వరం, పులిచింతల మీదుగా జగ్గయ్యపేట వరకు, అవనిగడ్డ నుంచి ఉయ్యూరు రోడ్డు వరకు, గుడిమెట్ల నుంచి వావిరాల మీదుగా చందర్లపాడు వరకు, ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురం మీదుగా విజయవాడ నగరం వరకు ఒక్కొక్క టీమ్ చొప్పున పర్యవేక్షణ చేస్తాయి. ప్రతి టీమ్‌లో ఒక ఎంవీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ లేదా హోంగాార్డు ఉంటారు. వీటిని ఆర్‌ర్టీవోలు డీఎస్‌ఎన్ మూర్తి, ఎస్.వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తారు. జిల్లాలోని సిబ్బంది కాకుండా బయటి జిల్లాల నుంచి 147 మంది కానిస్టేబుళ్లు, ఎంవీఐల నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల వరకు పుష్కర విధులకు రానున్నారు.


వీరంతా ఆగస్టు 10 నాటికి విధులకు హాజరవుతారు. వీరికి బస ఏర్పాటు కోసం 60 గదులు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లా పరిధిలోని సిబ్బందితో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటలోని గరికపాడు చెక్‌పోస్ట్, తిరువూరు సమీపంలో మరోటి ఏర్పాటు చేసి వాహనాల నుంచి పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటికే పుష్కరాల అంశంపై యాక్షన్ ప్లాన్‌పై చర్చించామన్నారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement