మాఫీనా.. మెలికా? | Sakshi
Sakshi News home page

మాఫీనా.. మెలికా?

Published Fri, May 23 2014 2:20 AM

fomers are waiting for crops loans discloseing

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికారం అప్పగిస్తే రైతుల రుణ మాఫీ పై మొదటి సంతకం చేస్తానని ప్రకటించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే తమ కోరిక తీరుస్తారని సుమారు 5 లక్షల మంది జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రుణమాఫీపై తొలి సంతకం చేసి జిల్లాలోని రూ.4500  కోట్ల దాకా ఉన్న రుణాలను రద్దు చేసి ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో రుణమాఫీ అన్న పదానికే కట్టుబడతారా? లేక కొత్త షరతులు తెర మీదకు తెస్తారా? అనే అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది.
 
 జిల్లాలోని వివిధ జాతీయ బ్యాంకులతో పాటు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక రుణాల కింద రూ.5 వేల కోట్లకు పైగా పంపిణీ చేశాయి. ఇందులో చాలా మంది రైతులు వడ్డీ మాత్రం చెల్లించి కొత్త రుణాలు తీసుకున్నట్లు రికార్డుల్లో సర్దుబాట్లు చేయించుకుని పాత రుణాలు జమ చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ రైతు రుణాల హామీ ప్రకటించింది. ఇందులో ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తారు? ఎంత మొత్తంలోపు రుణాలు రద్దు చేస్తారు? అనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని రైతులు బ్యాంకులు, సహకార బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశారు. బ్యాంకర్లు కనీసం వడ్డీ అయినా వసూలు చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేక పోయింది.
 
 దీంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయడానికి వెనుకంజ వేస్తున్నాయి. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని బ్యాంకర్లు, రెండు నెలలు ఆగితే అవకాశం ఉంటే రుణాలు రద్దు అవుతాయని, అంత వరకు వేచి చూడాలని రైతులు వాదిస్తూ వచ్చారు. జిల్లాలో సుమారు 2.5 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరుగుతోంది. ఇందుకు గాను 2013-14 సంవత్సరానికి 2వేల 458 కోట్ల వరకు వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఇవి కాకుండా రైతులు రీషెడ్యూల్ చేసుకున్న రుణాలు సుమారు 1,000 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటితో పాటు పంటలు నష్టపోయినందున బ్యాంకులకు అప్పులు చెల్లించక పేరుకు పోయిన బకాయిలు సుమారు 1,000 కోట్ల దాకా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవన్నీ కలిపితే జిల్లాలో రైతుల రుణాలు 4500 కోట్ల దాకా ఉన్నాయి.
 
 రైతుల్లో ఆందోళన
 చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణాల మాఫీ గురించి ఎన్నికలయ్యే దాకా ఆనందించిన రైతులకు ఇప్పుడు తమ రుణం మొత్తం రద్దవుతుందా? కొత్త ప్రభుత్వం రుణాలన్నీ రద్దు చేస్తుందా? లేక ఇప్పుడు మాట మార్చి ఏమైనా మెలిక పెడుతుందా? అనే ఆందోళన మొదలైంది. తాను రాష్ర్టం కలిసున్నప్పుడు పాదయాత్ర సందర్భంగా రుణ మాఫీ హామీ ఇచ్చానని, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉందని కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
 
 రుణాలన్నీ ఒకే సారి కాకుండా విడతల వారీగా మాఫీ చేసేట్లయితే బ్యాంకులు తమకు కొత్త రుణాలు ఇవ్వవని, అలాంటప్పుడు తాము రుణాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంత వరకు తమకు ఎలాంటి స్పష్టత లేదని జిల్లా అధికారులు, బ్యాంకర్లు చెబుతున్నారు. మొత్తం మీద జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులకు ఆనందం కలిగించేలా కొత్త సీఎం చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం రోజే రైతు రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తారా? లేక ఇందులో మెలిక పెడతారా?అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

Advertisement
Advertisement