వారు ‘తెల్లని’రాబందులు | Sakshi
Sakshi News home page

వారు ‘తెల్లని’రాబందులు

Published Sat, Jul 19 2014 12:16 AM

వారు ‘తెల్లని’రాబందులు - Sakshi

కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : రాబందులు చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అవి మృతకళేబరాలపై వాలి, వాటిని పీక్కు తినడం గగుర్పాటు కలిగిస్తుంది. చూడడానికి రాజహంసల్లా తెల్లటి దుస్తుల్లో ముచ్చటగా ఉండే కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) ఫోరెన్సిక్ విభాగంలో కొందరు వైద్యులు డబ్బుల కోసం ‘పీక్కు తినడం’లో రాబందులను మించిపోతున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు.
 
రాబందులు కళేబరాలను ఆరగిస్తే.. ఆ వైద్యులు తమ ఆత్మీయుల మృతదేహాలను అడ్డం పెట్టుకుని తమ జేబులను నిర్దయతో కొల్లగొడుతున్నారని వాపోతున్నారు. శవపరీక్ష (పోస్టుమార్టం)కు రేటు నిర్ణయించి, అంత మొత్తం చెల్లిస్తే తప్ప శవాన్ని తాకేది లేదని తెగేసి చెపుతున్నారని ఆరోపిస్తున్నారు. వైద్యులు డిమాండ్ చేసినంత సొమ్ము సమకూర్చుకోలేని పేద, మధ్య తరగతి వారు అయినవారి మృతదేహాల కోసం రోజుల తరబడి ఫోరెన్సిక్ విభాగం వద్ద ‘జాగరణ’ చేయాల్సి వస్తోంది.
 
రాజమండ్రికి చెందిన ఓ యువకుడు గోకవరం-రంపచోడవరం రహదారిలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ఈ నెల 10న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ 13న మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు జీజీహెచ్‌లోని ఫోరెన్సిక్ విభాగానికి తీసుకురాగా ఓ వైద్యుడు రూ.5000 డిమాండ్ చేశాడు. మధ్యతరగతి వారైన అతడి బంధువులు బతిమాలినా, కొందరితో సిఫారసు చేయించినా తెల్లదుస్తుల్లోని సదరు వైద్యుడు నల్లటి బండరాయిలా చలించలేదు.
 
చివరికి రూ.4000 ముట్టజెప్పిన బంధువులు అంతకంటే పైసా ఇవ్వలేమని మొర పెట్టుకోవడంతో.. రుసరుసలాడుతూనే పోస్టుమార్టం  నిర్వహించాడు. ఫోరెన్సిక్ విభాగంలోని ‘రాబడి రాబందు’ల్లాంటి ఇలాంటి కొందరు వైద్యులు నిత్యం మృతుల బంధువులను డబ్బుల కోసం కాల్చుకు తింటూనే ఉంటున్నారు. శవాలపై సొమ్ములు దండుకునే వారి నికృష్టానికి పరాకాష్ట.. అనాథ మృతదేహాల పోస్టుమార్టంకు కూడా తమ మామూళ్లు ‘మామూలు’గా ఇచ్చి తీరాల్సిందేనని పోలీసులను సైతం పీడించడమే.
 
అడిగినంతా ఇచ్చుకోవలసిందే..
కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)తో పాటు నగరంలోని ఇతర ఆస్పత్రుల్లో మెడికో లీగల్ కేసులకు సంబంధించిన మృతదేహాలను, పరిసరాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ ఆవరణలోని ఆర్‌ఎంసీ ఫోరెన్సిక్ విభాగానికే తీసుకు వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ రోజుకు ఐదుకుపైగా మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుంటారు. ఫోరెన్సిక్ విభాగంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారే కొందరు వైద్యులు పోస్టుమార్టం చేయాలంటే రూ.5 వేలు ముట్టజెప్పాల్సిందేనని మృతుల బంధువులను పీడిస్తున్నారు.
 
సొమ్ములు ఇవ్వకపోతే పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వరేమో, మృతదేహాలు చెడిపోయే వరకూ జాప్యం చేస్తారేమోననే భయంతో భారమైనా వైద్యులు అడిగిన మొత్తం ముట్టజెపుతున్నారు. చివరికి గుర్తు తెలియని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడకు తరలించిన తమను కూడా విడిచి పెట్టకుండా ముడుపులు గుంజుతున్నారని పోలీసులు వాపోతున్నారు.
 
చర్యలు తీసుకున్నా బేఖాతరు..
గతంలో ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు సొమ్ములు తీసుకున్నాడని ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కొన్ని నెలల పాటు పోస్టుమార్టం నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. అయితే ప్రస్తుతం తిరిగి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్న ఆ వైద్యుడు మునుపటిలాగే ‘చావుముడుపు’లు వసూలు చేస్తున్నాడని, అదే ఈ విభాగం బరితెగింపునకు నిదర్శనమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement