గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాజధాని హంగులు | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాజధాని హంగులు

Published Wed, Oct 29 2014 3:23 AM

గన్నవరం విమానశ్రయం టెర్మినల్ భవనం - Sakshi

టెర్మినల్ భవనం ఆధునీకరణ
వీఐపీ లాంజ్‌తోపాటు సీఐపీ లాంజ్
త్వరలో మరిన్ని విమాన సర్వీసులు

 
సాక్షి, విజయవాడ బ్యూరో:
గన్నవరం విమానాశ్రయానికి రాజధాని హంగు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆధునీకరించడంతోపాటు విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు చేయడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడం, విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అందుకు తగ్గట్లుగా ఎయిర్‌పోర్టు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌పోర్టులో సరైన వసతులు కూడా లేకపోవడం కొత్త రాజధానిలో పెద్ద లోపంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్య రాజకీయ నాయకులు తరచూ ఎయిర్‌పోర్టుకు వచ్చి వెళుతున్నారు. వీఐ పీలు, కార్పొరేట్ ప్రముఖులు, ముఖ్యులు తరచూ ఈ ప్రాంతానికి వస్తున్నారు. వచ్చిన వారంతా రాజధానిలో ఇంత చిన్న విమానాశ్రమయమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం అందరినీ ఆకర్షించేలా తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ఎయిర్‌పోర్టు అధికారులకు సూచిస్తున్నారు. దీంతో దీని రూపురేఖలు మార్చాలని ఎయిర్‌పోర్టు అథారిటీ భావిస్తోంది.
 
 తొలుత అంతర్జాతీయ స్థాయిలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించాలని యోచించారు. దానికి ఆమోదం లభించి, డిజైన్లు ఖరారై నిర్మాణం పూర్తికావడానికి ఎంతలేదన్నా మూడు సంవత్సరాలు పడుతుందనే అంచనాకు వచ్చారు. ఈలోపు రాజధాని ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతూ దేశ, విదేశీ ప్రముఖులు వచ్చి పోతుండడం, సాధారణ ట్రాఫిక్ కూడా పెరుగుతుండడంతో ఉన్న టెర్మినల్ భవనాన్నే ఆధునీకరించాలని చూస్తున్నారు. అత్యాధునికి హంగులపై ప్రతిపాదనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఉన్నతాధికారులకు పంపామని, త్వరలో ఆమోదం లభిస్తుందని గన్నవరం ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజకిశోర్ సాక్షికి చెప్పారు.

Advertisement
Advertisement