‘కృష్ణా బోర్డు’కు ఫిర్యాదు చేస్తాం | Sakshi
Sakshi News home page

‘కృష్ణా బోర్డు’కు ఫిర్యాదు చేస్తాం

Published Wed, Nov 5 2014 1:15 AM

‘కృష్ణా బోర్డు’కు ఫిర్యాదు చేస్తాం - Sakshi

ఏపీ మంత్రి దేవినేని ఉమ

* తెలంగాణ సర్కార్ ఉల్లంఘనను సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళతాం
* రైతులను కాపాడాలన్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి లేదు

 
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తికి నీటి వాడకంలో బోర్డు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడాన్ని కృష్ణానది యాజమాన్యబోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో కలసి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఢిల్లీ అక్బర్‌రోడ్డు-6లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఏపీ ప్రభుత్వం తరఫున పలు అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దేవినేని ఉమ, కంభంపాటి రామ్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...

కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు అమలు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుకు అదే విషయాన్ని చెప్పినట్టు ఆమె మాతో చెప్పారు. అయితే విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతిచ్చిందంటూ తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెప్పుకోవడం సరికాదు.

పంతాలకు పోయి శ్రీశైలం నీటి మట్టాన్ని 854 అడుగుల కంటే తగ్గిస్తే ఎస్‌ఆర్‌బీసీకి నీరందించలేం. ఇదే  జరిగితే రాయలసీమలోని రెండు లక్షల ఎకరాల పంట ఎండుతుంది. కేసీకెనాల్‌కు నీరు సరఫరా చేయలేము. రాయలసీమ ప్రాంతానికి మంచినీరు సైతం అందించలేని దుస్థితి ఏర్పడుతుంది.
 
ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో  60 టీఎంసీలు తక్కువగా ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తూ నీళ్లని సముద్రంలోకి వ దిలితే తెలంగాణ జిల్లాల్లో నల్లగొండ, ఖమ్మంతోపాటు కృష్ణ, ప్రకాశం జిల్లాలకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. నీటిని కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పెద్దమనసుతో తెలంగాణ 300  మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వస్తే కేసీఆర్ అంగీకరించలేదు.
 
కేసీఆర్ ఇచ్చిన ప్రతిపాదనలతోనే విభజన చట్టంలో కృష్ణానది యాజమాన్యబోర్డు అంశాన్ని యూపీఏ చేర్చింది. సీలేరు విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలని గోదావరి బోర్డు ఆర్డర్ ఇవ్వలేదు, అలా ఉంటే కేసీఆర్‌ని చూపించమనండి.

Advertisement
Advertisement