నేను మోనార్క్‌ని..! | Sakshi
Sakshi News home page

నేను మోనార్క్‌ని..!

Published Fri, Jan 31 2014 3:05 AM

నేను మోనార్క్‌ని..! - Sakshi

* నంద్యాలలో ఓ అధికారి వింత ప్రవర్తన
* ఆలయానికి వెళ్తే భక్తులెవరూ ఉండకూడదట..!
* సినిమాకెళ్తే ఇరువైపులా 20కుర్చీలు ఖాళీ
* పనిచేయాలంటే..పర్సెంటేజీలు ఇవాల్సిందే..!
* ఎమ్మెల్యే అనుచరుడిగా మంచి గుర్తింపు
 

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: అన్న నడిచొస్తే మాస్.. అన్న నిల్చుంటే మాస్ అని ఓ సినిమా పాట. దీనిని నంద్యాల ప్రజలు తిప్పిపాడుకుంటున్నారు.. ఆ అధికారి నడిచొస్తే హడల్.. నిల్చుంటే బెదుర్.. అంటూ రాగం తీసుకున్నారు.
 
ప్రజా సమస్యలు వింటూ..వాటిని పరిష్కరించాల్సిన అధికారి ఆయన.. అయితే ఆయన వద్దకు వెళ్లేందుకు ప్రజలే కాదు కిందిస్థాయి సిబ్బంది సైతం జంకుతున్నారు. తన రూటను సప‘రేటు’గా మార్చుకున్న ఆ అధికారి వ్యవహారం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆలయానికి వెళ్తే ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకాలి, పూజలు చేసేటప్పుడు పూజారి తప్ప ఎవరూ ఉండకూడదు. లేకపోతే సిబ్బందికి చీవాట్లు తప్పవు. సినిమాకు వెళ్తే, ఆయన పక్కన ప్రేక్షకులు ఎవరూ కూర్చోరాదు. ఇరువైపులా ఇరువై కుర్చీలు ఖాళీగా ఉండాలి. మోనార్క్‌లా వింత ప్రవర్తనతో ఈ అధికారి సిబ్బందికి నరకం చూపిస్తున్నారు.
 
హైదరాబాద్‌లోని ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఈ అధికారి పొరుగు జిల్లాకు చెందిన వారు. గతంలో నంద్యాలలో పని చేసి, అవినీతి అరోపణలు ఎదుర్కొని బదిలీ అయిన ఒక అధికారి ఈయనకు గురువు. ఆయన సలహా మేరకు, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ పైరవీలు చేసి, ఏడాది క్రితం తనకు ఎలాంటి అనుభవం లేని శాఖకు అధికారిగా వచ్చారు. కేవలం నాలుగు గోడలకే పరిమితమై, అంతో ఇంతో మామూళ్లతో సంతృప్తి పొందుతున్న ఈ  అధికారికి నంద్యాల కామధేనువు, కల్పవృక్షంలా కనిపించింది. ఒక్కసారిగా పట్టణ ప్రముఖ అధికారిగా గుర్తింపు రావడం, మీడియాలో మంచి పబ్లిసిటీ రావడంతో ఆయనలో అహం పెరిగి, వింత ప్రవర్తనకు దారి తీసింది.
 
వేదికలపై మంచి సూక్తులను చెప్పే ఈ అధికారి ప్రవర్తన  వింతగా ఉంది. ఇటీవల ఆయన నందవరం చౌడేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆయన లోపలికి వెళ్లాక, ఎవరూ పూర్ణకుంభంతో స్వాగతం చెప్పలేదని, కార్య నిర్వహణాధికారిని పిలిపించమని తన శాఖ సిబ్బందిపై ఆగ్రహం చెందారు. అమ్మవారి గర్భగుడి వద్ద ఆయనతో పాటు మరికొందరు భక్తులు పూజలు చేస్తుంటే అధికారికి కోపం వచ్చింది. తాను పూజ చేసేటప్పడు పూజారి తప్ప ఎవరూ ఉండకూడదని, బయటకు పంపివేయమని తన సిబ్బందిని చౌడేశ్వరీ మాత సమక్షంలోనే పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషించారు.

ఒక ప్రముఖ హీరో చిత్రం రిలీజైన నాల్గో ఆయన థియేటర్‌కు వెళ్లాడు. ఆయన అడుగులకు మడుగులలొత్తే సిబ్బంది అడ్వాన్స్ బుకింగ్ చేశారు. కాని అధికారి థియేటర్‌లోకి వచ్చి.. ‘‘నేను ప్రేక్షకుల మధ్య కూర్చోనడం ఏమిటి, మీకు బుద్ధి ఉందా, నేను ఎవరో, నా స్థాయిలో ఎవరో తెలియదా..’’ అంటూ శివాలెత్తారు. ఆయన కుర్చీకి ఇదరువైపులా ఇరువైసీట్లను ఖాళీ చేయించడంతో ఆయన శాంతించి సినిమా చూశారు. ఈ అధికారి వింత ప్రవర్తన చూసే సిబ్బంది తలపట్టుకుంటున్నారు. సిబ్బంది ఇతని తిట్లను భరించలేక, లోపలు దాచుకోలేక, బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు.
 
 హైదరాబాద్‌కు కూరగాయలు, మాంసం...
 ఈ అధికారి నంద్యాలలో విధులు నిర్వహిస్తుండగా కుటుంబం హైదరాబాద్‌లో ఉంది. ప్రతిరోజూ ఉదయం నంద్యాల పట్టణంలో రోడ్ల పక్కన రూ.2 దోశెలను తింటున్నారు. కేవలం ధనార్జన కోసమే హైదరాబాద్ నుంచి ఇక్కడి వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఇటీవల రహస్యంగా ఇద్దరు సిబ్బంది ద్వారా 20 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను గుట్టుచప్పుడు కాకుండా నియమించారు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ.75వేల వసూలు చేసినట్లు సమాచారం.
 
ఎమ్మెల్యే శిల్పామోమన్‌రెడ్డికి ఈ అధికారి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఈ అధికారి హైదరాబాద్ వెళ్లేటప్పుడు కూరగాయలు, బియ్యం, నిత్యావర వస్తువులు, మాంసంను ఒక విభాగం సిబ్బంది పంపుతున్నట్లు సమాచారం. ఈ అధికారి వేధింపులు భరించలేక, మాముళ్లను సమర్పించుకోలేక డిప్యూటేషన్ గడువు ఎప్పుడు పూర్తవుతుందో, ఆయన తిరిగి హైదరాబాద్‌కు ఎప్పుడు వెళ్తారోనని సిబ్బంది దేవుళ్ల మొక్కుకుంటున్నారు. కాని నంద్యాలను వదల్లేని ఈ అధికారి మరో ఏడాది డిప్యూటేషన్‌ను కొనసాగించుకోవడానికి పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. 

Advertisement
Advertisement