బడికి తాళాలు! | Sakshi
Sakshi News home page

బడికి తాళాలు!

Published Tue, Oct 17 2017 11:46 AM

government school locked for no classes from two months - Sakshi

పొందూరు : కీలక సబ్టెకులు బోధించే ఉపాధ్యాయులంతా బదిలీపై వెళ్లిపోయారు. రెండు నెలలుగా క్లాసులు నిర్వహించడం లేదు. బడికి వెళ్లడం.. ఆడుకోవడం.. ఇంటికి వెళ్లిపోవడం  విద్యార్థుల దినచర్య! మండలంలోని కేసవదాసుపురంలోని ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితిది! కొత్తగా టీచర్లను నియమిస్తారేమోనని ఇన్నాళ్లూ వేచిచూసిన తల్లిదండ్రుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. పిల్లల భవిష్యత్‌ నాశనమవుతుందని భయపడిన వీరంతా సోమవారం పాఠశాలకు తాళాలు వేశారు. ఎంఈవో, డీఈవో, కలెక్టర్‌ వచ్చేంత వరకూ తెరబోమని భీష్మించారు.

నిలిచిపోయిన బోధన
కేసవదాసుపురం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. జూలై చివరి వారంలో రేషనలైజేషన్‌ సమయంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ముగ్గురు వేరే పాఠశాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తెలుగు, ఇంగ్లిషు, సోషల్‌ సబ్జెక్టులు తప్ప మిగిలినవి బోధించటం లేదు. కీలకమైన హిందీ, లెక్కలు, పి.ఎస్, ఎన్‌.ఎస్‌. సబ్జెక్టులు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధన నిలిచిపోయింది.

పాఠాలు చెప్పనపుడు ఇంకెదుకు?
ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించట్లేదు. ఫార్మేటివ్‌–1, ఫార్మేటివ్‌–2 పరీక్షలు ఇప్పటివరకూ జరగలేదు. జి.ఓ నెంబర్‌ 43 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలో 30 మంది కంటే తక్కువ మంది ఉంటే.. ఆ పాఠశాలలో ఒకటో నుంచి ఐదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. బదిలీపై ఉపాధ్యాయులు వెళ్లిపోయినా కొత్తగా ఎవరైనా వస్తారని ఇప్పటివరకూ విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు. కానీ కొత్త ఉపాధ్యాయులు ఎవరూ రారని తెలియడంతో వారిలో ఆందోళన నెలకొంది. పాఠాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంలో ‘మాకెందుకీ పాఠశాల’అని తాళాలు వేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ బయటే ఉండిపోయారు. ఎంఈఓ, డీఈఓ, కలెక్టర్‌ వచ్చి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులను తీసుకురావాలని కోరుతున్నారు.

భయాందోళనలో తల్లిదండ్రులు
కేసవదాసుపురం గ్రామానికి దగ్గరల్లో లోలుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు నిర్ణయించుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఆ పాఠశాలలో చేరుతామంటే ప్రధానోపాధ్యాయులు వద్దన్నారని తెలిపారు. చిలకపాలెం హైవే మీదుగా అల్లినగరం వెళ్లి చదువుకొనే అవకాశం ఉంది. నిత్యం ప్రమాదాలు జరిగే రహదారి కావడంతో ఆ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోనే ఎనిమిదో తరగతి వరకు పాఠశాలను కొనసాగించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement