హోరెత్తిన గోవింద నామస్మరణ | Sakshi
Sakshi News home page

హోరెత్తిన గోవింద నామస్మరణ

Published Sat, Aug 31 2013 2:27 AM

Govinda Ratha Yatra in Bhimavaram

భీమవరం, న్యూస్‌లైన్ : పట్టణం  శుక్రవారం గోవింద నామస్మరణతో మార్మోగింది. గోవింద పెరుమాళ్‌ను పూలతో అలంకరించిన ఆశ్వరథంపై ఉంచి వందలాది మంది భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు త్రిదండి శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి, అలహాబాద్‌కు చెందిన త్రిదండి నృసింహరామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భూ, గోదాసమిత గోవింద పెరుమాళ్‌కు లక్ష కుంకుమార్చన, బిల్వపత్రార్చన, లక్ష తులసి అర్చనను భక్తులు వైభవంగా నిర్వహించారు.  ఆధ్యాత్మికవేత్త అల్లూరి శ్రీరామరాజు, సీతాయమ్మ దంపతుల పర్యవేక్షణలో పట్టణంలోని ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 
 
పట్టణంలో శోభా యాత్ర : స్వామీజీలు ముందుగా వందలాది మంది భక్తులతో పట్టణంలో గోవింద పెరుమాళ్‌ను పూలతో అలంకరించిన ఆశ్వరథంపై శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శోభా యాత్రకు ముందు కోలాట బృందాలు, ఒరిస్సా రాష్ట్ర శంఖ, డోలు, పంచ వాద్య బృందాలు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు అన్నమాచార్య కీర్తనలకు చేసిన నృత్యాలు భక్తులను మైమరిపించాయి. భాష్యకార సిద్ధాంత పీఠం ప్రధాన కార్యదర్శి దిట్టకవి కల్యాణ చక్రవర్తి, చెరుకువాడ రంగసాయి, వేగేశ్న విశ్వనాథరాజు, ఏఎస్సార్ సేవాసమితి అధ్యక్షుడు కనుమూరి సత్యనారాయణరాజు, కార్యదర్శి రుద్రరాజు వేణుగోపాలరాజు, దంతులూరి మధుసూదనరావు, గుండు అక్కిరాజు, అల్లూరి అచ్యుతరామరాజు, జంపన సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement