గ్రీన్ జోన్ గరంగరం | Sakshi
Sakshi News home page

గ్రీన్ జోన్ గరంగరం

Published Mon, Feb 22 2016 1:22 AM

Green Zone garangaram

రైతుల్లో తీవ్ర వ్యతిరేకత
తమ భూములపై ఆంక్షలు తొలగించాల్సిందేనని ఆందోళనలు
పంచాయతీల్లో తీర్మానాలు   అయినా పట్టించుకోని పాలకులు

 
జి.కొండూరు : సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన గ్రీన్ జోన్ అంశంపై రైతులు గరం గరంగా ఉన్నారు. ఈ జోన్లను పూర్తిగా ఎత్తేయాలని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. పంచాయతీల్లో మూకుమ్మడిగా తీర్మానాలు కూడా చేస్తున్నారు. వేల కొద్దీ అభ్యంతర పత్రాలను సీఆర్‌డీఏ అధికారులకు పంపిస్తున్నారు. అయినా నేటికీ ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
 
పడిపోయిన భూముల ధరలు...
గ్రీన్‌జోన్ ప్రకటనకు ముందు వరకు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని మైలవరం, జి.కొండూరు, ఉయ్యూరు, గుడివాడ తదితర ప్రాంతాల పొలాలు కోట్ల రూపాయల్లో ధరలు పలికాయి. గ్రీన్ జోన్ పుణ్యమా అంటూ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు దారుణంగా పడిపోవటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
 
కుటుంబాల్లో కలహాలు...
 గతంలో భూముల ధరలు మంచి రేటు పలకటంతో అదే చెప్పి కట్నం కింద ఇచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులపై ఇప్పుడు ఒత్తిళ్లు వస్తున్నాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో అదనపు కట్నం కోసం అల్లుళ్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయని పలువురు వాపోతున్నారు. జి.కొండూరు మండలం వెంకటాపురంలో తాజాగా ఒక కుటుంబంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం, ఇంటి నిర్మాణం తదితర  అవసరాల కోసం ఉపయోగించుకోవాలనుకున్నా అక్కరకు రాని పరిస్థితి నెలకొంది.
 
ఉపాధి అవకాశాలూ రావు...
రాజధానికి సమీపంలోనే ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రీన్ జోన్ నిర్ణయంతో ఆ అవకాశమూ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు మినహా, ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన చెందుతున్నారు.
 
గ్రీన్ జోన్ పరిధిలో 20 లక్షల ఎకరాలు...
సీఆర్‌డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 5,440.26 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వ్యవసాయ పరిరక్షణ జోన్ ప్రతిపాదించారు. ఈ విస్తీర్ణం రీజియన్‌లోని మొత్తం భూమిలో 63.23 శాతంగా ఉంది. సుమారు 20 లక్షల ఎకరాలు దీని ఈ జోన్ల పరిధిలో ఉంది. ఈ జోన్లలో పట్టణీకరణకు ప్రభుత్వం అనుమతించదు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, డెయిరీ, పౌల్ట్రీ, చేపల చెరువుల సాగుతోపాటు వ్యవసాయాధారిత కార్యకలాపాలకే ఇక్కడ అవకాశం ఉంటుంది. అయితే వ్యవసాయ రక్షణ జోన్-2, 3లో అవుటర్ రింగు రోడ్డు, ఇతర ప్రధాన రోడ్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో పట్టణీకరణకు అవకాశం ఇస్తారు. కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాన్ని జోన్-1 పరిధిలో చేర్చారు. విజయవాడ, గుడివాడ, నూజివీడు తదితర పట్టణాలను అభివృద్ధి చేస్తామంటూనే వాటి చుట్టు పక్కల ప్రాంతాలన్నింటినీ అగ్రిజోన్‌లో చేర్చారు. గతంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలను సైతం ఈ జోన్లలో చేర్చడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లు నుంచి అగ్రిజోన్ కిందకు వచ్చింది. కానీ ఉయ్యూరు వరకూ ఎప్పుడో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు తమ భూములపై ఆంక్షలు విధించడంతో రైతులు ఒప్పుకోవడం లేదు. గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాలను ఇలాగే చేర్చారు.
 
సగానికి అమ్ముకున్నా
సున్నంపాడులో 10 ఎకరాల పొలం ఉంది. పిల్లల చదువు కోసం అమ్మాలని గ్రీన్ జోన్ రాకముందు బేరానికి పెట్టా. అప్పుడు ఎకరం 50 లక్షలకు అడిగారు. ఇంకా ఏమైనా బేరం వస్తుందని చూసేలోగా గ్రీన్ జోన్ ప్రకటించారు. జి.కొండూరు మండలాన్ని దాని పరిధిలోకి చేర్చారు. దీంతో పొలం కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లాడు చదివే డాక్టర్ సీటు కోసం డబ్బులు కట్టాల్సి రావటంతో ఉన్న పొలంలో  ఐదెకరాలను ప్రస్తుతం బేరం పెట్టాను. మూడు రోజుల క్రితం ఎకరా రూ.21 లక్షలకు అమ్ముకోవాల్సి వచ్చింది. తీవ్రంగా నష్టపోయా.  - పరికల కాసులు, జి.కొండూరు
 
 పిల్లల భవిషత్తు అగమ్యగోచరమైంది
జి.కొండూరు గ్రామ శివారులో జాతీయ రహదారికి అనుకుని నాకు 5.48 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొలం అమ్మి ఆ డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేద్దామనుకున్నా. ఎకరం రెండు కోట్లకు బేరం పెడితే రూ.1.50 కోట్ల వరకు అడిగారు. బేరం నడుస్తున్న సమయంలో గ్రీన్ జోన్ ప్రకటన రావటంతో ధర దారుణంగా పడిపోయింది. ఎకరం 60 లక్షలకు కూడా అడిగేవారు కనిపించటం లేదు.
 - నలమోలు కమలాకర్‌రెడ్డి, జి.కొండూరు
 
అడిగేవాళ్లు లేరు
విజయవాడకు దగ్గర ఉన్న వెలగలేరులో ఏడాది క్రితం భూములకు మంచి ధరలు పలికాయి. నా స్నేహితులతో కలిసి ఎకరా రూ.80 లక్షలు చొప్పున ఐదెకరాలు కొనుగోలు చేశా. అడ్వాన్స్ కింద రూ.కోటి చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత విక్రయించేందుకు ప్రయత్నించగా ఎకరాకు రూ.కోటి ఇస్తామన్నారు. ఇచ్చేయాలనుకుంటున్న తరుణంలో గ్రీన్ జోన్ ప్రకటన వచ్చింది. దీంతో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం రూ.50 లక్షలకు కూడా అడిగే వారు లేరు.     - గంగుల నాగేశ్వరరావు, వెలగలేరు
 
నోరు మెదపని అధికార పార్టీ నేతలు

గ్రీన్ జోన్‌కు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజల నుంచి ఆందోళనలు మొదలవుతున్నా అధికార పార్టీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుంటున్నారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు సమాధానం చెప్పలేక మౌనం దాల్చుతున్నారు. గ్రీన్ జోన్ వల్ల నష్టపోతున్న టీడీపీ శ్రేణుల్లోనూ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement