ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి

Published Tue, May 19 2015 2:25 AM

ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి - Sakshi

- నేటి నుంచి బదిలీల జాతర
- మార్గదర్శకాలు విడుదల
 
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకేచోట రెండేళ్లు పూర్తి చేసిన వారిని పరిపాలన అవసరం మేరకు బదిలీ చేస్తారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా శాఖాధిపతి సభ్యులుగా ఉద్యోగుల బదిలీలకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ 57) జారీ చేసింది. సోమవారం (18వ తేదీ) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆ మధ్య సమయంలో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో సోమవారం రాత్రి విడుదల కావడంతో మంగళవారం నుంచి బదిలీల జాతర ప్రారంభం కానుంది.
 
ఇవీ బదిలీల మార్గదర్శకాలు..
- ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి.  ఈ ఏడాది జూన్ 30లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయరాదు.  ఒకే చోట రెండేళ్లు పనిచేయని వారినీ బదిలీ చేయరాదు.
- ఒకే చోట రెండేళ్లు పూర్తి అయిన ఉద్యోగులను పరిపాలన అవసరాలు లేదా ఇతర కారణాలతో బదిలీ అవకాశం.
- రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలంటే 40% వికలాంగులై ఉండాలి, భార్య, భర్తల కేసులో ఒకరికే అవకాశం.
- కేన్సర్, ఓపెన్ హార్ట్‌సర్జరీ, న్యూరోసర్జరీ వంటి చికిత్సల్లో  కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, ఆ ఉద్యోగులు కోరిన చోటుకు..
- మానసిక వైకల్యం గల పిల్లలు ఎవరైనా చికిత్స పొందుతుంటే సంబంధిత ఉద్యోగులు కోరిన చోటుకు..
- ఉన్నత, గెజిటెడ్ స్థాయి అధికారులకు సొంత జిల్లాల్లో, ఇతర ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదు. సొంత జిల్లా అనేది సర్వీసు రిజిష్టర్ ప్రామాణికం.
- పదోన్నతిపై ఏదైనా ఉద్యోగి బదిలీ కావాల్సి వస్తే, బదిలీ అయ్యే చోట పోస్టు లేకుంటే బదిలీ చేయరాదు.
- బదిలీ చేసిన ఉద్యోగి ఐదు పనిదినాల్లోగా రిలీవ్ కావడంతో పాటు బదిలీ చేసిన చోటుకు వెళ్లి చేరాలి.
- వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రెజరీ, రవాణా రంగాల ఉద్యోగుల బదిలీలకు ఈ ఉత్తర్వులు వర్తిం చవు. వీరికి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తారు.
- పాఠశాల, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రంగాల్లోని ఉద్యోగులు, వైద్యులకు, ఉపాధ్యాయలకు, అధ్యాపకులకు బదిలీలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. వారికి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తారు.

Advertisement
Advertisement