వరికి ఊపిరి | Sakshi
Sakshi News home page

వరికి ఊపిరి

Published Thu, Oct 29 2015 1:07 AM

వరికి ఊపిరి

జిల్లాలో భారీవర్షం
గూడూరులో అత్యధికం 128.2 మిల్లీమీటర్లు
రైతులకు కొంత ఊరట

 
మచిలీపట్నం : తూర్పుకృష్ణాలో బుధవారం తెల్లవారుజాము  ఒంటి గంట నుంచి 5గంటల వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా గూడూరు మండలంలో 128.2 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఉంగుటూరు మండలం 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 19.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తూర్పుకృష్ణాలో భారీ వర్షం కురవడంతో వరి పొలాల్లో నీరు చేరింది. ఇంత కాలంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న  వరి పైరుకు కొంతమేర ఊపిరి పోసినట్లయ్యింది.

రైతుల్లో ఆనందం.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇంత వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. వర్షాధారంగా, డ్రెయిన్లలోని నీటి ఆధారంగా 4.64 లక్షల ఎకరాల్లో ఎన్నో ఆశలతో వరిసాగు చేశారు. మరో 1.75 లక్షల ఎకరాల్లో వరిసాగు నిలిచిపోయింది. సెప్టెంబరు 20వ తేదీ నుంచి కాలువలను పూర్తిస్థాయిలో కట్టివేశారు.  సాగునీటి ఎద్దడి తీవ్ర తరం కావడంతో మంత్రి కామినేని శ్రీనివాస్, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 

Advertisement
Advertisement