రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు-నీట మునిగిన పొలాలు | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు- నీట మునిగిన పొలాలు

Published Wed, Oct 23 2013 5:39 PM

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు-నీట మునిగిన పొలాలు - Sakshi

హైదరాబాద్: సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీటమునిగాయి. భారీ నష్టం సంభవించింది. అనేక ప్రాంతాలలో రాకపోకలు స్తంభించాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం పెరిగిపోవడంతో గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలో వర్షపాతం అధికంగా ఉంది. జిల్లా అంతటా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని  గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 6 గేట్లు ఎత్తివేశారు.  23 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సగిలేరు వాగు ఉప్పొంగిపొర్లుతోంది. ఈ వాగు సమీపంలోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి.  వైఎస్ఆర్ సిపి నేత అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టారు.

ఒంగోలు-చీరాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. సింగాయరాయకొండ మండలం సానంపూడి వద్ద ముట్టేరువాగులోకి  వరద నీరు వచ్చి చేరింది.  వాగు ఉధృతి పెరిగింది.  పటికనేనివారిపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.  పరుచూరు మండలం అడుసుమల్లి గ్రామం వద్ద సాకీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.  గుంటూరు, పరుచూరూలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

వైఎస్‌ఆర్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.  కలశపాడు, పోరుమామిళ్లలో భారీ వర్షం కురిసింది. ఇళ్లు  నీట మునిగాయి.  సగిలేరు డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరింది.   5 గేట్లు ఎత్తివేసి నీటిని వదిలారు.  కలశపాడు మండలం రామాపురంలో భారీ వర్షానికి 17 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

విశాఖపట్నం జిల్లాలో పెద్దెరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది.  నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చోడవరం సమీపంలో  బొడ్డేరుకాజ్వే దెబ్బతింది.  200 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  దేవరపల్లి మండలం రైవాడ రిజర్వాయర్ ఎడమ కాలువకు గండి పడింది.  దీంతో విశాఖ నగరానికి నీటి తరలింపునకు  అంతరాయం ఏర్పడింది.

విశాఖ జిల్లాలో వర్షపాతం వివరాలు:
మందస 17 సెం.మీ
పలాసా, సోంపేట, ఇచ్చాపురం 15 సెం.మీ
అనకాపల్లి 12
పత్తిపాడు,చోడవరం, కాకినాడ 12 సెం.మీ
కళింగపట్నం 11
భీమవరం, తుని, ఎస్‌కోట, కమలాపురం, నర్సాపురం 10
పెద్దాపురం, విశాఖపట్నం, కావలి 10 సెం.మీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బొగాపురం మండలం రావాడ పెద్ద చెరువు వద్ద  వంతెన కూలింది. 20 గ్రామాలకు రాకపోకలు  నిలిచిపోయాయి. కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో 200 ఎకరాల్లో పంట నీట మునిగింది. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబరు 08922 276 888, 1077.  

కర్నూలు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  భవనాసి, గుండ్లకమ్మ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. పాములపాడు మండలం బానుముక్కలలో  మొక్కజోన్న పంట వరదకు కోట్టుకుపోయింది. 40 లక్షల రూపాయల వరకు పంటనష్టం జరిగిందని అంచనా. శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుంటూరు జిల్లాలో విస్తారంగా  వర్షాలు కురుస్తున్నాయి.  బాపట్లలో అత్యధికంగా 60.8 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదయింది. పత్తి, మిర్చి పంటలకు నష్టమని  రైతులు భయపడుతున్నారు.  భారీ వర్షాలకు నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్‌పాలెం వద్ద  కుప్పగంజివాగు పొంగిపొర్లుతోంది.  వినుకొండ వద్ద  గుండ్లకమ్మ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలిలో శివారు కాలనీలు జలమయం అయ్యాయి.  సత్తెనపల్లి, అచ్చంపేట మధ్యలో వాగు పొంగిపొర్లుతోంది.  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement