ముంచెత్తుతున్న వానలు.. కర్షకుడికి కన్నీళ్లే | Sakshi
Sakshi News home page

ముంచెత్తుతున్న వానలు.. కర్షకుడికి కన్నీళ్లే

Published Thu, Oct 24 2013 2:05 AM

Heavy rains.. Farmer's in tears

వాయుగుండం రైతులపాలిట దినదినగండంగా మారింది. పగబట్టిన ప్రకృతి కర్షకుడికి కన్నీళ్లను మిగులుస్తోంది. మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి పంటలు నీటిపాలవుతున్నాయి. పత్తి, మొక్కజొన్న మొలకలు వచ్చి రైతుల ఆశలను తుంచేస్తున్నాయి. నీటమునిగిన వరిచేలు రైతును కన్నీటిపాలు చేస్తున్నాయి.
 
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో రైతులు ప్రస్తుత సార్వా సీజన్‌లో 6.42 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వాటిలో మూడు లక్షల ఎకరాల్లో బీపీటీ 5204(సాంబామసూరి), రెండున్నర లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1061, సుమారు లక్ష ఎకరాల్లో ఎంపీటీయూ 1001, బాసుమతి, మిగిలిన రకాలు వేశారు. ఇప్పటికే విత్తన రకాలు ఈనిక పూర్తి చేసుకుని గింజలు పాలుపోసుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అవి కోతకు రానున్నాయి.

ఆలస్యంగా నాట్లు వేసిన అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, కోడూరు, ఘంటసాల మండలాలతోపాటు గూడూరు, బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి మండలాల్లో పైరు నిలదొక్కుకునే దశలో ఉంది. ఈనిక దశలోను, పాలుపోసుకునే దశలో ఉన్న చేలకు ప్రస్తుత వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కోడూరు, బందరు, ముదినేపల్లి తదితర మండలాల్లో 1500 ఎకరాల వరిచేలు నీట మునిగాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
 ఆక్వాకూ అవస్థలే..

 జిల్లాలో 75 వేల ఎకరాల్లో చేపలు, 35 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల  కారణంగా వల్ల ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు, బందరు, కృత్తివెన్ను, అవనిగడ్డ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు కాసి, ప్రస్తుతం మబ్బులు, వర్షం పడడంతో రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.   చెరువుల్లో ఆక్సిజన్ సమతుల్యత కోసం ఏరియేటర్లను తిప్పడం, చేపల చెరువుల్లో డీవోబీ సమస్య రాకుండా మందులు చల్లడం, మేతలు తగ్గించడం వంటి చర్యలను ఆక్వా రైతులు చేపట్టారు.

 పత్తి పంటకు రూ.2 కోట్ల నష్టం..
 
 జిల్లాలో లక్షా 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ, పంట దశల్లో ఉంది. ప్రస్తుత వర్షాలతో దాదాపు పది శాతం వరకు పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నష్టం 30 శాతం వరకు ఉంటుందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల కారణంగా పత్తికాయలకు బూజు తెగులు వచ్చి దూదిపింజలు పగలకుండా కుళ్లిపోతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విచ్చుకున్న పత్తి వర్షాలకు తడిసి రంగుమారే ప్రమాదం ఉంది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సుమారు రూ.2 కోట్ల విలువైన పంట నష్టపోయినట్టు అంచనా. ఎకరాకు సుమారు రూ.10 వేల వరకు నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండటంతో మొక్కలు ఎర్రబారి ఎండిపోతున్నాయి. దీని కారణంగా నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
 
 మొక్కజొన్న, కూరగాయల పంటలకూ నష్టమే..

 జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి.  ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి మొలకలు వచ్చేశాయి. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మండలాల్లో లేతగా ఉన్న బీర, దోస, కంద పొలాల్లోకి నీరు చేరడంతో మొక్కలు చనిపోయే ప్రమాదం ఏర్పడింది. నీట మునిగిపోవడంతో బీర, దోస, కంద పూత రాలిపోవడం, కాయలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పసుపు చేలల్లో నీరు రెండు మూడు రోజులు నీరు నిల్వ ఉంటే దుంప కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టమాటా తోటలో నీరు చేరే ప్రమాదం ఉంది. ఈ ప్రభావంతో ధరలు  మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని తమలపాకుల తోటల్లో నీరు నిల్వ ఉండడంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 నష్టాలను అంచనా వేస్తున్నాం : జేడీఏ
 భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను అంచనా వేస్తున్నట్టు ఇన్‌చార్జి జేడీఏ బాలూనాయక్ ‘సాక్షి’కి చెప్పారు. చల్లపల్లి, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో బుధవారం ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇప్పటికే వరిచేలు నీట మునిగాయని, వర్షం పెరిగితే నష్టం పెరుగుతుందని అన్నారు. పత్తి 10 శాతానికి పైగా నష్టం ఉంటుందని అన్నారు. విచ్చుకున్న పత్తికాయలు తడిసిపోతే రంగుమారిపోతుందన్నారు. తయారైన కాయల్లోకి నీరుచేరి కుళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పత్తి పూత రాలిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. దీనికి సంబంధించి పంట నష్టాలు అంచనాలు వేయాల్సి ఉంద న్నారు. కాగా వరిలో పెద్దగా నష్టం లేదని చెప్పారు.
 
 ఈ చర్యలు తీసుకోండి..

 జిల్లాలో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఈ చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.మహేశ్వర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 వరి చేలల్లోని నీటిని బయటకు తోడి, నేలవాలిన వరిదుబ్బులను సుడులు కట్టుకుని నిలబెట్టాలి. నీట మునిగిన వరిపైరు దుబ్బు దశ నుంచి అంకురం ఏర్పడే దశలో ఉంటే పాముపొడ తెగులు వచ్చే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటరు హెక్సాకోనాజోల్ మందు లేదా ఒక మిల్లీలీటరు ప్రోపికొనజోల్ లేదా రెండు మిల్లీలీటర్ల వాలిడామైసిన్ మందు వాడాలి. అగ్గి తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో 0.6గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును పిచికారీ చేయాలి. దోమ, ఆకుముడత తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిఫెట్ మందు పిచికారీ చేయాలి.
 
 పత్తి పొలంలోని నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడాలి. ఎకరానికి 20కిలోల యూరియాతోపాటు 10 కిలోల పొటాషియం నైట్రేట్‌ను చల్లాలి.  తెగుళ్ల నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఒక గ్రాము కార్బన్‌డిజమ్ లీటరు నీటిలో కలిపి చల్లాలి. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కలు పూర్తిగా తడిసేటట్టు పిచికారీ చేయాలి.
 
 కూరగాయల పంటల్లో, పాక్షికంగా దెబ్బతిన్న మిరప చేలో రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పక్కకు వంగిపోయిన మిరప మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మట్టిని ఎగదోయాలి.
 
 పాక్షికంగా దెబ్బతిన్న పసుపు పంట పొలంలో 0.5 శాతం పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల్లో  రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. భూమి ఆరిన తర్వాత 50 గ్రాముల ఎంవోపీ, 250 గ్రాముల వేపపిండి మొక్క దగ్గర వేయాలి. ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటరు చొప్పున వారం వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలి.
 

Advertisement
Advertisement