ఏ అధికారంతో ఈ కేటాయింపులు? | Sakshi
Sakshi News home page

ఏ అధికారంతో ఈ కేటాయింపులు?

Published Thu, Feb 13 2014 12:14 AM

ఏ అధికారంతో ఈ కేటాయింపులు? - Sakshi

పార్టీలకు నామమాత్రపు రేట్లతో భూములపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సామాన్యుడికి మార్కెట్ రేటు.. పార్టీలకు మాత్రం నామమాత్రపు ధరా?
మీది ధనిక పార్టీయే కదా.. మార్కెట్ ధర చెల్లించమనండి
కాంగ్రెస్ పార్టీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్య

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి ఏ అధికారంతో రాజకీయ పార్టీలకు నామమాత్రపు ధరకు భూములను కట్టబెట్టిందో చెప్పాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ నిబంధనలకు అనుగుణంగా, ఏ విధి విధానాలకు లోబడి పార్టీలకు నామమాత్రపు ధరలకు భూములు కట్టబెట్టారో అఫిడవిట్ రూపంలో వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం భూమిని కోరే పౌరుల నుంచి మార్కెట్ ధర వసూలు చేసే ప్రభుత్వం, అదే భూమికి రాజకీయ పార్టీల నుంచి మాత్రం నామమాత్రపు ధరను వసూలు చేయటంలో ఔచి త్యాన్ని ప్రశ్నించింది. భూముల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వ తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానిం చింది. నెల్లూరు జిల్లా గూడూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కి దాదాపు ఎకరా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం 2009లో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ వి.గోపీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
 ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. పార్టీలకు భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం గత వారం సమర్పించిన మంత్రి మండలి తీర్మానాలను ధర్మాసనం పరిశీలించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సి.దామోదర్‌రెడ్డి లేచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తానని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీ పార్టీ ధనిక పార్టీ కదా? మరి మీరు పొందిన భూమికి మార్కెట్ ధర చెల్లించవచ్చు. అందులో ఇబ్బందేముంది..? మీ నాయకులను చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడూ విమానాల్లో తిరుగుతూ ఉంటారు. వారు ధనికులే కదా. మార్కెట్ ధర చెల్లించమని వారికి చెప్పండి’ అని దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement
Advertisement