హైవే విస్తరణకు మోక్షం | Sakshi
Sakshi News home page

హైవే విస్తరణకు మోక్షం

Published Sun, May 17 2015 2:48 AM

Highway expansion salvation

ఆరు లేన్లుగా
అనకాపల్లి-ఆనందపురం రహదారి
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుతో
చర్చించిన అధికారులు
‘డీపీఆర్’ తయారు చేయాలని నిర్ణయం

విశాఖపట్నం : 
ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనకాపల్లి-ఆనందపురం రోడ్డు విస్తరణలో మరోసారి కదలిక వచ్చింది. ఈ సమస్యకు మోక్షం కలి గించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్ణయించారు. వెయ్యి కోట్లతో నిర్మాణం చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాల్సిందిగా జాతీ య రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డెరైక్టర్ విజయకుమార్, విశాఖ ఆర్‌అండ్‌బి పర్యవేక్షక ఇంజనీర్ జి.కాంతులను శనివారం ఆదేశించారు. 58.22 కిలోమీటర్ల పొడవున నాలుగులేన్లుగా విస్తరించడానికి ఆరేళ్ల క్రితం రూ.535 కోట్ల అంచనాతో శ్రీకారం చుట్టారు.

కార్యరూపం దాల్చలేదు. దీనిని నాలుగు కాదు ఆరు లేన్లుగా విస్తరించాలని రూ.839 కోట్ల అంచనాలతో 2012లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 143 కల్వర్టులు, 10 సర్వీస్ రోడ్లు, 8 ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, 11 వెహికల్ అండర్ పాసెస్‌లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 4ట్రక్ లే బేలు, 267 జంక్షన్ల ఆధునీకరణ, 25 బస్ బేలు, 34 బస్ షెల్టర్లు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలనుకున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. 30 నెలల్లో పనులు పూర్తి చేయాల్సిందిగా ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్‌కు టెండరు అప్పగించారు. 2013లో ఆ కాంట్రాక్టు రద్దు చేశారు. అప్పటి నుంచీ ప్రాజెక్టు మూలన పడింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు పూర్తయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉన్నా నేటికీ ఈ ప్రాజెక్టులో కదలిక రాలేదు.

2012లో టెండర్లు ఆమోదించినపుడు విశాఖ ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఆమె కూడా ఈ ప్రాజెక్టును గాడిన పెట్టే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా అశోక్‌గజపతిరాజు ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించారు. సుమారు రూ.1000కోట్లతో ఆరులేన్లగా అభివృద్ధి చేయడానికి విజయనరంలోని తన నివాసంలో అధికారులతో చర్చించి ఆరు నెలల్లో డీపీఆర్ పూర్తి తయారు చేసి టెండర్ల స్థాయికి తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ఢిల్లీలోని జాతీయ రహదారుల అధికారులు, కేంద్ర రోడ్డు , రవాణా,హైవేస్, షిప్పింగ్ శాఖామంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి, పనులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement