హోంగార్డు చోరీల పర్వం | Sakshi
Sakshi News home page

హోంగార్డు చోరీల పర్వం

Published Wed, Aug 27 2014 3:13 AM

homegaurd of the theft

కర్నూలు: పోలీసు అంటే ఆపదలో పది మందికి కాపలాదారు... కష్టాల్లో రక్షకుడు... ఇబ్బందుల్లో సహాయకుడు... ఇలా సమాజంలో వారి సేవలు ఎన్నెన్నో... అయితే ఆ శాఖలో హోంగార్డుగా పని చేస్తూ ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్(డీఎస్పీ) రాజశేఖర్‌రాజుకు వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న హోంగార్డు తేజేశ్వరరెడ్డి కొంతకాలంగా నేరాల బాట పట్టాడు.

వృత్తి పోలీస్ అయినప్పటికీ చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. రిటైర్డ్ ఆర్‌ఎస్‌ఐ కుమారుడైన తేజేశ్వరరెడ్డి నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. వివాహ వేడుకలు, శుభకార్యాలు జరిగే ఫంక్షన్ హాళ్ల వద్ద మాటు వేసి చిన్న పిల్లలను హాయ్ చిట్టి... హాయ్ బుజ్జి... అంటూ చేరదీసి చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను తస్కరించడం ఇతను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఇతడు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఈనెల మొదటి వారంలో ఓ చిన్నారి మెడలో నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించినట్లు పోలీసుల విచారణలో వెలుగులో వెలుగుచూసింది. దేవీ ఫంక్షన్ హాల్‌లో కూడా ఇదే తరహాలో బంగారు గొలుసును తస్కరించినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 ఇలా దొరికిపోయాడు
 ఇటీవల ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో చిన్న పాప మెడలో గొలుసు తస్కరించినట్లు వీడియో ఫుటేజ్‌లో రికార్డ్ కావడంతో అసలు విషయం బయటపడింది. గమనించి బాలిక కుటుంబ సభ్యులు హోంగార్డుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆధారాలు సేకరించిన పోలీసులు తేజేశ్వరరెడ్డిని పట్టుకునేందుకు ప్రయత్నించగా 15 రోజుల నుంచి విధులకు కూడా హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచడంతో స్వయంగా తండ్రి తన కొడుకును స్టేషన్‌కు అప్పగించినట్లు సమాచారం. మూడవ పట్టణ పోలీసులు హోంగార్డును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విచారణలో మరిన్ని ఆసక్తికర దొంగతనాలు వెలుగు చేసే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement