లెక్కల ‘పంచాయితీ’ | Sakshi
Sakshi News home page

లెక్కల ‘పంచాయితీ’

Published Fri, Aug 23 2013 4:05 AM

How much money spent for Panchayat Elections?

సాక్షి, కొత్తగూడెం: పంచాయతీ ఎన్నికల్లో డబ్బు వరదలా పారింది. ఎంత కట్టడి చేసినా మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేశారు. నిబంధనలకు నీళ్లొదిలారు. ఎన్నికల తతంగం ముగిసి నెలరోజులైనా ఇప్పటి వరకు ఖర్చు వివరాలను మాత్రం అధికారులకు అందజేయలేదు. అసలు ఎలా చూపాలోనని గెలుపొందిన అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఓటమి చెందిన వారు కూడా ఖర్చు వివరాలు అందజేయాలని జిల్లా అధికారులు సూచించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఆ వివరాలు సమర్పించలేదు. జిల్లాలో 758 పంచాయతీలుండగా 39 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 
 
అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 7 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగలేదు. రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా రూ. కోట్లలో ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు వివరాలు రప్పించే విషయంలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులతో పాటు పంచాయతీ యంత్రాంగం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. ఖర్చు వివరాలు సేకరించాల్సింది ఎంపీడీఓలే అన్నట్టుగా జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారులు, తాము కాదు పంచాయతీ శాఖ వారేనని ఎంపీడీఓలు.. ఇలా ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఖర్చు వివరాలను నమోదు చేయడానికి మండలాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు.
 
మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఆడిట్ కోసం సహకార శాఖకు చెందినవారిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. దీంతో పాటు తహశీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కింది నుంచి పై స్థాయి వరకు కేవలం ఎన్నికల ఖర్చు వివరాలు సేకరించేందుకే వ్యవస్థలు ఏర్పాటు చేసినా నేటికీ ఏ ఒక్కరి నుంచి కూడా తీసుకోలేకపోయారు. ఈ అధికారులంతా గ్రామాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి. కానీ సిబ్బంది కొరతను సాకుగా చూపి నమోదు చేయకుండానే వదిలేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆడిటర్ వద్దకు వచ్చిన లెక్కలు తప్పితే క్షేత్ర స్థాయిలోకి వచ్చి ప్రచార ఖర్చును లెక్కించలేకపోయారు. 
 
గెలిచిన అభ్యర్థుల తర్జన భర్జన..
ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు అసలు ఎన్నికల ఖర్చు విషయాన్నే పట్టించుకోవడం లేదు. కానీ ఎన్నికల సంఘం మాత్రం వీరు కూడా ఖర్చు వివరాలు అందజేయాలని పేర్కొంది. వీరి విషయాన్పి పక్కన పెడితే గెలిచిన అభ్యర్థులు లెక్క చూపడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఎంత చూపితే ఏమవుతుందోనని హైరానా పడుతున్నారు. రూ. లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన సర్పంచ్ అభ్యర్థులు దేనికి ఎంత ఖర్చు చేశామని ప్రాథమికంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇదంతా చూపితే తమ పదవికే ముప్పు వస్తుందని.. తగ్గించి చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఎలా ఖర్చు చూపారని మాజీ సర్పంచ్‌లను అడిగి తెలుసుకుంటున్నారు. 
 
 రూ. లక్షల నుంచి 
 రూ. కోటి వరకు ఖర్చు..
 2006 వరకు గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల ఖర్చు వివరాలు స్వయంగా అప్పగించేవారు. కానీ ప్రస్తుతం పోటీ చేసిన అభ్యర్థులంతా లెక్కలు సమర్పించాలన్న నిబంధన విధించారు. లెక్కలు చూపించకపోతే మూడేళ్ల పాటు మరే ఎన్నికల్లోనూ పోటీచేసే అవకాశం లేదని హెచ్చరిక సైతం జారీ చేశారు. నిబంధనల ప్రకారం 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ. 80 వేలు, వార్డు సభ్యులు రూ.10 వేలు, 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.40 వేలు, వార్డు సభ్యులు రూ. 6 వేలు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాలి. కానీ అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ఖర్చు చేశారు. పలు మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు రూ.కోటి వరకు కూడా ఖర్చు పెట్టారు. 
 
 వివరాలు అందజేయాల్సిందే : 
 డీపీఓ ప్రభాకర్‌రెడ్డి
 అభ్యర్థులు ఖర్చు వివరాలు గడువులోపు సమర్పించకుంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. వచ్చే నెల 2న అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేస్తాం. ఈ లోపు ఓడిన, గెలుపొందిన అభ్యర్థుల ఖర్చు వివరాలు సంబంధిత అధికారులకు అందజేయాలి. 
 

Advertisement
Advertisement