ఉద్వేగం. ఉత్తేజం.. ఉత్సాహం... | Sakshi
Sakshi News home page

ఉద్వేగం. ఉత్తేజం.. ఉత్సాహం...

Published Mon, Feb 3 2014 2:18 AM

ఉద్వేగం. ఉత్తేజం.. ఉత్సాహం... - Sakshi

 చుట్టూ శేషాచల పర్వత పంక్తులు.. మధ్యలో జనదేవుని సన్నిధి..  జనం మెచ్చిన నాయకుడి  నేతృత్వంలో రెండవ మహాప్రస్థానం. ఇంకేముంది.. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వైఎస్సార్ అభిమానులు తండోపతండాలుగా హాజరయ్యారు.
 
 ఇడుపులపాయ చేరుకున్న ప్రతి ఒక్కరు ముందుగా వైఎస్సార్  ఘాట్ సందర్శించి మహానేతకు నివాళులర్పించారు. ఆపై అభిమాననేతల ప్రసంగాలు వినాలని ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఆశలు వమ్ము కాలేదు.. ముగ్గురు ముగ్గురే  అన్పించేలా ప్రసంగించారు...  ఒకరు  హృదయాలను ద్రవింపజే స్తే, మరొకరు కుట్రలు, కుయుక్తులకు ధీటైన జవాబునిచ్చారు.. ఇంకొకరు రాష్ట్ర దశ-దిశపై స్పష్టత నిస్తూ, పిల్లలకు అన్నలా, పెద్దలకు తమ్ముడులా, ముదుసలులకు
 మనువడిలా, తోబుట్టువులకు సోదరుడులా తానున్నానంటూ స్పష్టత నిచ్చారు.
 
 సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ మహాప్రజాప్రస్థానం (ప్లీనరీ) ఆదివారం  ఇడుపులపాయలో నిర్వహించారు.   అధ్యక్షుడితో బాటు ఇతర ముఖ్యనాయకులను  పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి ఆహ్వానించారు.
 
 వైఎస్ జగన్ వేదికపైకి రాగానే ప్రతినిధులు హర్షధ్వానాలు చేశారు.  ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దివంగతులైన పార్టీ నాయకులకు  సంతాపం తెలిపిన అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్ కుటుంబం  ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.. కష్ట కాలంలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.  రాజకీయ కక్షతో  తన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో అక్రమంగా నిర్బంధించారని, రాజకీయాలంటే ఎరుగని తాను, షర్మిల ప్రజల మధ్యకు రావాల్సి వచ్చిందని చెబుతున్నప్పుడు ప్రతినిధులు కన్నీళ్లు పెట్టుకున్నారు.. వైఎస్, చంద్రబాబు, కిరణ్ సర్కార్‌ల  పనితీరును నిశితంగా విశ్లేషించారు. మొత్తం మీద  విజయమ్మ ప్రసంగం ప్రతినిధుల హృదయాలను కదిలించింది.
 
 ఉత్సాహం నింపిన షర్మిల ప్రసంగం...
 రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం.. నా పాదయాత్రలోనే ఈ విషయం స్పష్టమైంది..   కుట్రలు,కుయుక్తులు శాశ్వతం కాదు.. ప్రతి ఒక్కరూ అన్నకు తోడుగా సింహాలై గర్జించండి.. ప్రజల ఆదరాభిమానాలు మనపై ఉన్నాయి అంటూ  షర్మిల  చేసిన ప్రసంగం వైఎస్సార్‌సీపీ ప్రతినిధులను ఉత్సాహపర్చింది.  కుయుక్తులతో ఆరోపణలు చేస్తున్నారని, చిత్తశుద్ధి ఏపాటిదో వారి చర్యలే స్పష్టం చేస్తున్నాయని  వివరించారు.  ఎల్లో మీడియాను తూర్పారపట్టినప్పుడు ప్రతినిధుల నుంచి స్పందన వ్యక్తమైంది.
 
 బడుగులకు అండగా నిలుద్దాం ...
 రాబోవు కాలం మనదే..  వైఎస్  సువర్ణయుగం మరోమారు చూపిద్దాం.. బడుగులకు అండగా నిలుద్దామంటూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పిలుపు ఇచ్చారు..  మహిళలకు సోదరుడిగా గ్యాస్ భారం భరిస్తామని, డ్వాక్రా మహిళలకు అండదండగా రుణాలు రద్దు చేస్తామని, బడిమానుతున్న పిల్లలకు అన్నగా ఆదరించి బడికెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని, వికలాంగులు, వృద్దులు, వితంతువులు, చేనేతలకు తలలో నాలుకలా నిలుస్తానని.. మూగ,చెవిటి పిల్లలకు పునర్జన్మ ప్రసాదించేందుకు శాయశక్తుల కృషి చేస్తానంటూ చేసిన  వైఎస్ జగన్ ప్రసంగం ఆకట్టుకుంది.  రైతులకు అండగా మరిన్ని  మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 101, 102 పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా  గిట్టుబాటు ధరల కోసం స్థిరీకరణ నిధిని రూ.3వేల కోట్లు కేటాయిస్తామని వివరించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రలను ఎండగట్టారు.
 
 ఒకే పార్టీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ రాజకీయాలు చేయడం, పార్టీ నడ పటం నాయకత్వం అన్పించుకోదని వివరించారు. లీడర్ అంటే విశ్వసనీయత, విలువలతో ఉండాలని.. పార్టీలో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా ఒకే మాట మీద నిబద్దతతో ఉండాలని.. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చిత్తశుద్ధితో చేస్తున్నామని, జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టామని వివరించారు..  మొత్తంగా  ప్లీనరీలో జగన్, విజయమ్మ, షర్మిల చేసిన ప్రసంగాలు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి.. పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాయి.
 
 ప్లీనరీ విజయవంతం
 ప్లీనరీ విజయవంతం కావడంతో వైఎస్‌ఆర్ సీపీలో నూతనోత్తేజం  వెల్లివిరుస్తోంది. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతోపాటు పలువురు నాయకులు  ఇడుపులపాయలోనే మకాం వేసి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు.
 

Advertisement
Advertisement