సీఎం రాజీనామా చేసిఉంటే సోనియా దిగివచ్చేవారు: దాడి | Sakshi
Sakshi News home page

సీఎం రాజీనామా చేసిఉంటే సోనియా దిగివచ్చేవారు: దాడి

Published Mon, Oct 21 2013 3:24 PM

సీఎం రాజీనామా చేసిఉంటే సోనియా దిగివచ్చేవారు: దాడి - Sakshi

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఉంటే యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దిగివచ్చేవారని వైఎస్ఆర్ సిపి సిజిసి సభ్యుడు  దాడి వీరభద్రరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన రాజీనామా ఇవ్వనిది కాక, మంత్రులను కూడా రాజీనామా ఇవ్వనివ్వలేదన్నారు. ఇచ్చిన వారి రాజీనామాలను  ఆమోదించే పరిస్థితి లేదని తెలిపారు.  ఇదంతా ఓ పెద్ద డ్రామా అన్నారు.

జీఓఎం ఏర్పాటు, చర్చలు, ప్రక్రియ కొనసాగింపు అన్నీ ఒకటి వెంట ఒకటి జరిగిపోతున్నాయన్నారు. అయినా సీఎం ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడే శక్తి అతనికి ఉందా? అని అడిగారు. వ్యతిరేకత నిజమైతే ఆయనను ముఖ్యమంత్రిగా పీకిపారేసేవారన్నారు. సోనియా అడుగుజాడల్లోనే సీఎం నడుతున్నారని చెప్పారు.  కాంగ్రెస్కు  నూకలు చెల్లాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ మట్టికొట్టుకుపోతుందనే ఉద్దేశంతో కొత్తపార్టీ పెట్టడానికి సీఎం సిద్దమవుతున్నారన్నారు. . సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒక పార్టీ పెట్టి సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా సోనియాతో కుమ్మక్కులో భాగమేనన్నారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజుకు కూడా ఎవరికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? ఇప్పటికీ చెపడంలేదన్నారు. ఆయన మాటలలో స్పష్టతలేదని తెలిపారు. జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, సమాదానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారన్నారు.  స్పష్టత లేకుండా ఆత్మగౌరవ యాత్ర అంటారు. ఎవరి ఆత్మగౌరవం కోసం యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టే దమ్ముందా మీకు అని చంద్రబాబుని అడిగారు.

చంద్రబాబు, కిరణ్‌లు కాకమ్మ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. వారిద్దరూ సమైక్య ద్రోహులన్నారు. తెలుగుజాతి వారిని ఎన్నటికీ క్షమించదని చెప్పారు. చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర మొదలుపెట్టేముందు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలన్నారు. కేబినెట్ రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.  సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీ నామా చేయాలన్నారు.  బ్రదర్ అనిల్‌పై వచ్చిన ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు దాడి చెప్పారు. 

Advertisement
Advertisement