సీఎం కిరణ్ దుర్యోధనుడు | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ దుర్యోధనుడు

Published Mon, Feb 3 2014 2:38 AM

If we accept the power of the second capital

  •     మేము అధికారంలోకి వస్తే ఓరుగల్లు రెండో రాజధాని
  •      దళిత మోర్చా సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
  •  హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ :  కేంద్రంలో ప్రధానమంత్రిగా ధృతరాష్ర్డుడు, రాష్ట్రంలో సీఎంగా దుర్యోధనుడు ఉన్నాడని... వచ్చే మహాభారత పోరాటంలో ధర్మం, న్యాయం గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఓరుగల్లును రెండో రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని మైదానంలో ఆదివారం బీజేపీ దళిత మోర్చా జిల్లాస్థాయి సదస్సు జరిగింది.

    ముఖ్య అతిథిగా హాజరైన  కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌ను  కాంగ్రెస్ పార్టీ అన్నింటా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయకపోతే భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్‌లో పెట్టించారని, అంబేద్కర్‌కు భారతరత్న కూడా ఇప్పించించేందుకు కృషిచేశారన్నారు.

    వాజ్‌పేయి ప్రభుత్వం దళితుల దే వుడైన అంబేద్కర్‌కు ప్రాధాన్యమిచ్చి రూ.100 కోట్లతో ఆయన స్మారక కేంద్రం నిర్మాణానికి పూనుకుని పనులు మొదలుపెడితే యూపీఏ సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని నిలిపివేసిందని ఆరోపించారు. అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ సర్కార్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్ అని.. ఇటీవ ల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ఆయన భీరాలు పలికితే పార్టీ ఘోర పరాజయం పాలైందని విమర్శించారు.
     
    దళితులంతా దండుగా కదలాలి : సంజయ్‌పాశ్వాన్
     
    వచ్చే ఎన్నికల్లో దళితులంతా దండుగా కదిలి బీజేపీకి అండగా నిలవాలని ఆ పార్టీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు సంజయ్‌పాశ్వాన్  కోరారు. సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఓరుగల్లుకు పోరాట చరిత్ర ఉందని, ఈ ప్రాంత దళితులు సమస్యల పరిష్కారం కోసం ఏక తాటిపై నిలిచి ఉద్యమిస్తారని తెలిపారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడంతోనే దళితులు సమాజంలో ఇంకా జీవిస్తున్నారని చెప్పారు. వేటగాడి రూపంలో వెంట పడుతున్న అగంతకులపై దళితులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వచ్చే ఎన్ని కల్లో నరేంద్రమోడీ ప్రధాని కాగానే అభివృద్ధి ఎలా ఉండాలి, కులాలు, కులవృత్తుల వారీగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకుపోతున్నామన్నారు.

    పరిశ్రమల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాయి అమ్మిన వ్యక్తి దేశానికి ప్రధాని ఎలా అవుతారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని.. చాయి అమ్మిన వారికే పేదల కష్టాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. దళిత, గిరిజనులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు, పాన్‌షాప్, చాయి అమ్మేవారంతా మోడీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
     
    టికెట్ ఆశించడం లేదు..
     
    హన్మకొండ సిటీ : జిల్లాలో బీజేపీ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నాను.. అయినప్పటికీ కొంతమంది నాయకులు వృద్ధుడిని అని చెబుతూ తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు.. నేను టికెట్ ఆశించి పార్టీలో ఉండడం లేదని... బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి జంగారెడ్డిని మాట్లాడాలని కోరారు.

    అయితే  కొద్ది సేపటికే సమయభావం దృష్ట్యా జంగారెడ్డిని మాట్లాడించలేక పోతున్నామని, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడతారని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన జంగారెడ్డి వేదిక దిగి వెళ్లిపోయారు. గమనించిన పార్టీ నాయకులు వెంటనే ఆయనను సముదాయించి వేదికపైకి తీసుకొచ్చి మాట్లాడించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ దళితులకు అండగా ఉంటుందని చెప్పారు. తాను 1980లోనే ఎస్సీ వర్గీకరణ కావాలని పోరాటం చేశానని, అప్పుడు మందకృష్ణ మాదిగ ఇంకా ఉద్యమం మొదలు పెట్టలేదని తెలిపారు.

    సదస్సులో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేశపాక రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత సాంబమూర్తి, నాయకులు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, పుష్పలీల, ఎడ్ల అశోక్‌రెడ్డి మార్తినేని ధర్మారావు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు,  సునీల్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, రావు పద్మ, ఆజ్మీరా కృష్ణవేణి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, జయపాల్, రమేశ్, రాందాస్, ప్రభాకర్, విజయరావు, మార్టీన్ లూథర్, మందాడి సత్యనారాయణరెడ్డి, తిరుపతిరె డ్డి, రాంబాబు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కె.అశోక్‌రెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్,  పాల్గొన్నారు.

    కాగా, జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, పార్టీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు సంజయ్ పాశ్వాన్ హిందీలో ప్రసంగించగా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ నాయకురాలు పుష్పలీల ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించారు. పార్టీ నాయకుడు గందె నవీన్ కిషన్‌రెడ్డికి గదను అందించగా, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తలపాగ  ధరింపజేశారు.
     
    స్టాచ్ ఆఫ్ యూనిటి ప్రచార రథం ప్రారంభం
     
    గుజరాత్‌లోని నర్మదా నది వద్ద నిర్మించనున్న సర్దార్ వల్లబ్‌బాయి పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉక్కును, మట్టిని సేకరించేందుకు చేపట్టనున్న ప్రచార రథాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఆదివారం హన్మకొండలో జరిగిన దళిత సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా వాహనంపై ఏర్పాటు చేసిన సర్థార్ వల్లబ్‌బాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. గుజరాత్ నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడికి పంపించారు. విగ్రహ నిర్మాణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రథం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉక్కు, మట్టి సేకరిస్తుంది.

Advertisement
Advertisement