మోదం.. ఖేదం | Sakshi
Sakshi News home page

మోదం.. ఖేదం

Published Sun, May 11 2014 2:41 AM

మోదం.. ఖేదం - Sakshi

విశాఖరూరల్, న్యూస్‌లైన్: అకాల వర్షం శుక్రవారం రాత్రి జిల్లాను ముంచెత్తింది. కొన్ని చోట్ల వ్యవసాయాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులను వెంటబెట్టుకుని రైతన్నపై దాడి చేసింది. ఏజెన్సీలోని పాడేరులో  రికార్డు స్థాయిలో 9.5 సెంటీమీటర్లు, మైదానంలో సగటున 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.కుండపోతగా కురిసిన వర్షానికి మన్యం తడి సి ముద్దయింది. వాతావరణం చల్లబడి జనం ఉపశమనం పొందినా, వ్యవసాయానికి ఎక్కువగా విఘాతం కలిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయానికి మేలు చేసింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.

 పశుగ్రాసం పెంచుకునేందుకు, ఖరీఫ్ దుక్కులకు అనుకూలమ న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాణిజ్య పంటల కు ఈ వాన జీవం పోసింది. జనవరి నుంచి మైదానంలోని కొన్ని ప్రాంతాల్లో చిటుక్కున చినుకులేదు. భానుడి ప్రతాపంతో మెట్ట పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. కొందరు రైతులు వ్యవసాయ మోటార్ల ఆధారంగా చెరకు, అరటి, కూరగాయల పంటలను కాపాడుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షం ఊరటనిచ్చింది. దాంతో వేసవి దుక్కులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏజెన్సీలో కాఫీ, మిరియాల పంటలకు మేలు చేకూరుతుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది మండలాల్లోనూ రబీ వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 200 హెక్టార్లలో కోతలు పూర్తయి పొలాల్లో ఉన్న రబీ వరి పనలు తడిసి ముద్దయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 190 హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. ఈదురు గాలులకు లక్షలు విలువైన మామిడి కాయలు నేల రాలిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవరాపల్లి మండలంలో 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగి పంట దెబ్బతింది.

అకాల వర్షం ఏజెన్సీలో కూరగాయల పంటలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా క్యాబేజీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అరకులోయ మండలం చినలబుడు, హట్టగుడ,మంజగుడ గ్రామాల్లో ఆదివాసీ రైతులు సాగు చేపట్టిన ఈపంట పూర్తిగా పాడైపోయింది. డుంబ్రిగుడ మండలంలో దేముడువలస, మాలివలస, సొవ్వా, కురిడి, కొల్లాపుట్టు గ్రామాల్లో గిరిజనులు పండించి క్యాబేజీ, టమాటా పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.కుండ పోత వర్షానికి రబీవరికి కూడా నష్టం వాటిల్లింది. జీకే వీధి మండలం పీకేగూడెం గ్రామంలో 4 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రావికమతం మండలంలో అర్ధరాత్రి వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరుపాక, చీమలపాడు, గర్నికం గ్రామాల్లో బారీ వృక్షాలు పడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మునగపాక ప్రాంతంలో 60 హెక్టార్లలో రబీవరి నీటమునిగింది.
చింతపల్లిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చౌడుపల్లి డ్యామ్, తాజంగి రిజర్వాయర్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్.రాయవరం మండలం సైతారుపేట సమీపంలోని ఆర్‌అండ్‌బీరోడ్డుపై ఉన్న బ్రిడ్జి భారీ వర్షానికి  కొంతమేర కుంగిపోవడంతో పాటు ధ్వంసమైంది. మండల కేంద్రంతో పాటు సుమారు 20 గ్రామాల వారు దీనిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.

Advertisement
Advertisement