సిటీ..పిటీ | Sakshi
Sakshi News home page

సిటీ..పిటీ

Published Fri, Jun 19 2015 3:03 AM

సిటీ..పిటీ

-ముంచెత్తుతున్న మురుగు
- కొద్దిపాటి వర్షానికే నగరం జలమయం
- టెండర్ల దశ దాటని బుడమేరు
- స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి విడుదల కాని నిధులు
- నగరవాసులకు తప్పని తిప్పలు
విజయవాడ సెంట్రల్ :
పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది నగరం పరిస్థితి. చిన్నపాటి వర్షాలకే నగరం తటాకాన్ని తలపిస్తోంది. మురుగు ముంచెత్తుతోంది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం జలమయమైంది. రోడ్లపై దారితెలియక పలువురు వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఏళ్లతరబడి కొనసా...గుతున్న నిర్మాణ పనులు, అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ నగర వాసుల పాలిట శాపంలా పరిణమించాయి. డ్రెయిన్లలో డీ సిల్టింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. బుడమేరు ముంపు నివారణకు సంబంధించి రూ.47.59 కోట్లు విడుదలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.462 కోట్లలో తొలి విడత రూ.110 కోట్లను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
 
పూర్తికాని పూడికతీత

నగరపాలక సంస్థ అధికారులు ఈ ఏడాది రూ.1.28 కోట్లతో డీ సిల్టింగ్ పనులు చేపట్టారు. ప్రజారోగ్య, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. జూన్ ఒకటి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 34 మేజర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. మీడియం, మైనర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లలో మురుగు రోడ్లపై పొంగిపొర్లుతోంది. వన్‌టౌన్, వించిపేట, కొత్తపేట, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, మొగల్రాజపురం, పటమట, ఆటోనగర్ ప్రాంతాల్ని మురుగు ముంచెత్తింది. భవానీపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్‌ఎస్‌సీ బోస్ నగర్ (కండ్రిక), జక్కంపూడి కాలనీ ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడక తప్పడం లేదు.  
 
అస్తవ్యస్తం
నగరంలో మురుగు పోయేందుకు నగరంలో సరైన ప్రణాళిక లేదు. భూగర్భ డ్రెయినేజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఓపెన్ డ్రెయిన్ల నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. డ్రెయిన్ల ద్వారా వచ్చే మురుగునీటిలో కొంత భాగాన్ని బుడమేరు, కృష్ణానదుల్లో కలుపుతున్నారు. మిగిలిన నీటిని బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లోకి మళ్లిస్తున్నారు. జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా భూగర్భ డ్రెయినేజీని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.271.48 కోట్లు కేటాయించారు. 2015 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాాగా, అనేక ప్రాంతాల్లో ఇంకా పనులు కొన..సాగుతూనే ఉన్నాయి. భూగర్భ డ్రెయినేజీకి అనుసంధానమైన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి.
 
పనులు జరిగితేనే..

బుడమేరు ముంపు నివారణ, స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులు పూర్తయితే కానీ నగర వాసులకు వరద కష్టాలు తప్పవు. బుడమేరు ముంపు నివారణకు సంబంధించి రూ.47.59 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.9 కోట్లను స్థల సేకరణకు సంబంధించి రైల్వే అధికారులకు చెల్లించారు. మిగిలిన మొత్తంతో సర్కిల్-1, 2 ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నారు. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్రం రూ.461.04 కోట్లు మంజూరు చేసింది.

నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి 100 కి.మీ. మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ. మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. మూడేళ్లలో నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ఏడాది రూ.110 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే  నగరానికి వరద ముంపు తిప్పలు తప్పినట్లే.

Advertisement
Advertisement