సంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి | Sakshi
Sakshi News home page

సంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Published Fri, Jun 20 2014 2:30 AM

Include the construction of the traditional fishermen

  • అభివృద్ధి పేరుతో తీరాన్ని కొల్లగొడితే సహించబోం
  •  తీరప్రాంతంపై మత్స్యకారులకు హక్కులు కల్పించాలి
  •  తీరప్రాంత నియంత్రణ మండలికి చట్టభద్రత కల్పించాలి
  •  ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు
  • విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట తీరప్రాంత మత్స్యకారుల జీవనానికి, జీవనోపాధికి ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజారావు హెచ్చరించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి తీరప్రాంతంపై పడిందన్నారు.

    ఇందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద తీరం ఉందని, అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్న నాయకులు మత్స్యకారుల సమస్యలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 60 లక్షలకుపైగా ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. మత్స్య కారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

    పక్క రాష్ట్రాల్లో మత్స్యకారులను ఎస్టీలుగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మండల కమిషన్ నివేదికలోనూ ఈ అంశం ఉందన్నారు. తీరప్రాంతంపై మత్స్యకారులకు హక్కులు కల్పించాలని, 2009లో రూపొందించిన ముసాయిదా బిల్లుకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరారు. చేపల బజారుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న మహిళా మత్స్యకార కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

    2011లో రూపొందించిన తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్‌జడ్) ముసాయిదా బిల్లును చట్టం చేయాలన్నారు. సముద్రంలో చేపలవేట సాగిస్తున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు.
     
    చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు బియ్యంతో పాటు రూ.9,400 నగదు చెల్లించాలన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందన్నారు. సంప్రదాయ మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేపల వేట సాగించేవారికి సబ్సిడీపై డీజిల్ అందజేయాలన్నారు.

    వ్యవసాయదారులకు ఇస్తున్నట్లే మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని కోరారు. అభివృద్ధి పేరుతో తీరప్రాంతాన్ని కొల్లగొట్టి మత్స్యకారులనే తరిమివేయాలని చూస్తే సహించబోమన్నారు.  ఈ సమావేశంలో మత్స్యకార యువజన సంఘం అధ్యక్షుడు తెడ్డు శంకర్, కె.ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement