మాతాశిశు మరణాలపై విచారణ | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలపై విచారణ

Published Tue, Sep 24 2013 4:33 AM

Inquiry Into Mother, Baby's Death in khammam Hospital

ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది మధ్య సమన్వయలోపం ఉన్నట్లు  ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డాక్టర్ కనకదుర్గమ్మ అన్నారు. 2011 -12 సంవత్సరాలలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సంభవించిన మాతాశిశు మరణాలపై విచారణ చేపట్టేందుకు సోమవారం ఆమె ఖమ్మం వచ్చారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆమె తొలుత ఆస్పత్రిలోని ఓపీ, కాన్పుల వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు.
 
 అక్కడి నుంచి సర్జరికల్ వార్డు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి వెంట వెళ్లారు. ఒక అధికారిణి గురించి విచారణ చేపట్టేందుకు వచ్చిన ఉన్నతాధికారిణి చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె వెంటే వెళ్లడం వివాదాస్పదంగా మారింది.  2011 - 12 మధ్య కాలంలో జిల్లా ఆరుగురు మృతి చెందారు. మరోమహిళకు ఆపరేషన్ నిర్వహించే సమయంలో మాపు( ఆపరేషన్ సమయంలో ఉపయోగించే గుడ్డ)ను కడుపులో వదిలేశారు. ఈ ఏడు సంఘటనల్లో నాలుగు కేసులపై ఆమె విచారణ చేపట్టారు. ఈ నాలుగు కేసుల్లో కూడా రెండు కేసులకు సంబంధించి బాధితుల బంధువులు విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు వైద్యులు కృపా ఉషశ్రీ, మంగళ, శ్రీనివాసరావు, సమ్మయ్య, డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, నర్సింగ్ సిబ్బంది హాజరయ్యారు. వారి వద్ద నుంచి రాతపూర్వకంగా వివరాలు సేకరించారు.
 
 అలాగే కేస్ షీట్ జీరాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణాధికారిణి డాక్టర్ కనకదుర్గ విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు సేవలు సక్రమంగానే అందుతున్నాయని అన్నారు. అయితే వైద్యులు, సిబ్బంది మధ్యే సమన్వయలోపం ఉన్నట్లు తన పరిశీలనలో వెల్లడయిందని అన్నారు. దీర్ఘ కాలంగా ఒకే చోట పని చేస్తున్నందున ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, అలాగే ఇక్కడ గ్రూపులు కూడా ఉన్నాయన్నారు. సేవలందించడంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రోగులు ఆమె దృష్టికి తీసుకురాగా పక్కనే ఉన్న సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్‌లను ప్రశ్నించారు. వైద్యులు, సిబ్బంది తమ మాటలు వినడం లేదని వారు సమాధానం ఇవ్వడంతో ఇద్దరు అధికారులు ఉండి చర్యలు తీసుకోవడం లేదని, తామే వచ్చి అన్నింటికి చర్యలు తీసుకోలేమని అన్నారు. ఇటీవల ఆస్పత్రిలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు.   
 
 రోగుల సహాయకుల భోజనశాల ప్రారంభం
 ఆస్పత్రిలోని మహిళల సర్జికల్ వార్డు వద్ద రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, సూపరిటెండెంట్ సుబ్బయ్య, ఆర్‌ఎంఓ శోభాదేవి, రహిమ్, జగ్గయ్య పాల్గొన్నారు.
 
 విజిలెన్స్ అధికారిణికి నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదులు...
 ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది విజిలెన్స్ అధికారిణి కనకదుర్గమ్మకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తొలుత ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన హెడ్ నర్స్ ఆంథోనమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేయగా, మరి కొద్ది సేపటికి నర్సింగ్ సూపరింటెండెంట్.. హెడ్ నర్సు నాగలక్ష్మి ఆధ్వర్యంలో హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు కొందర్ని తీసువచ్చి ఫిర్యాదు చేయించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఎవరినీ వేధించడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని తెలపడంతో కొంతమంది సంతకం చేసేందుకు నిరాకరించారు. విజిలెన్స్ అధికారిణి కలిసిన వారిలో నాగలక్ష్మి, సునీత, లక్ష్మి, మనోహరం, స్టెలా, విజయశ్రీ, ఎంఎల్‌ఏ మేరి, జి. కవిత, వి.కవిత, ఇందిర ఉన్నారు.

Advertisement
Advertisement