రైతులకు విలీనం ముప్పు | Sakshi
Sakshi News home page

రైతులకు విలీనం ముప్పు

Published Sat, Jul 19 2014 1:05 AM

Integrated threat to farmers

కుకునూరు : ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా మారింది ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాల రైతుల పరిస్థితి. ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చడంతో తెలంగాణ నుంచి ఏడు మండలాల్లోని (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎరువులు అందని దుస్థితి ఏర్పడింది. జూలై నెల గడుస్తున్నా ఇప్పటికీ ఎరువులను సరఫరా చేయని జిల్లా మార్క్‌ఫెడ్ విలీనం సాకును చూపుతోంది. దీంతో ఆయా మండలాల రైతులు ఎరువుల కోసం దిక్కులు చూస్తున్నారు.
 
పది సంఘాలకు పోటు
జిల్లా పరిధిలో 105 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా లు ఉండగా, ముంపు మండలాల్లో పది ఉన్నాయి. వాటిలో కుకునూరు, వింజరం సహకార సంఘం పరిధిలో ఉన్న నాలుగు వేలకు మందికి పైగా రైతులకు నేటికీ ఒక్క ఎరువుల బస్తాకూడా అందలేదు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, చెరుకు, ఆయిల్‌పామ్ సాగుకు యూరియా, 20-20, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులన్నీ  కలిపి సుమారు 3 వేల టన్నులు అవసరం ఉంటుంది.
 
ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సాగుపై నిరాశగా ఉన్న రైతులు, ఇప్పుడు ఎరువులు కూడా లభించకపోవడంతో మరింత కుంగిపోతున్నారు. ఎరువుల కోసం వ్యయ ప్రయాసాల కోర్చి తెలంగాణలో ఉన్న భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. అక్కడ అధిక ధరలను భరించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
 
సరఫరా లేదు
గతేడాది రైతులకు దాదాపుగా 3 వేల టన్నుల ఎరువులు అవసరంకాగా, జిల్లా మార్క్‌ఫెడ్ కేవలం వెయ్యి టన్నులను మాత్రమే సరఫరా చేసింది. వాటిలో యూరియా పూర్తిగా విక్రయించగా, 20-20, పొటాష్ వంటి ఎరువులు కొద్ది మోతాదులో గిడ్డంగుల్లోనే పడి ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ ఇచ్చాం కదా...ఎరువులను పంపండి అని పీఏసీఎస్ సంఘాల పాలకవర్గం సభ్యులు  ప్రాధేయపడినా జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు.

మీ మండలాలు ఆంధ్రాలోకి వెళ్లాయి.. ముందుగా నగదును చెల్లించి.. ఎరువులను తీసుకెళ్లండంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. కాగా రూ.లక్షల నగదును ముందుగా చెల్లించే స్థోమత ముంపు మండలాల పరపతి సంఘాలకు లేదు. ఈ మండలాలను ఆంధ్రాలో కలపడం వల్ల మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేయడంలేదని, మేము ఏమీ చేయలేమని ఆ సంఘాలు చేతులెత్తేస్తున్నాయి.

Advertisement
Advertisement